మెదక్ జిల్లా, తూప్రాన్ : తెలంగాణ రాష్ట్రంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తున్న సందర్భంగా ఈనెల 28వ తేదీన సిద్దిపేటలో జరిగే ఎమ్మార్పీఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ విజ్ఞప్తి చేశారు. ఈ మహాసభకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరు కానున్నారని తెలిపారు. కావున ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలను మోసం చేస్తున్నారని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వర్గీకరణ అమలు చేయకుండా మాదిగ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రాకుండా నోటికాడి బుక్కను ఎత్తగొడ్తూన్నాడని విమర్శించారు. మాదిగల మీద మాటల ప్రేమను కురిపిస్తూ, ఉద్యోగ అవకాశాలలో మాదిగలకు దక్కవల్సిన వాటాను దక్కకుండా మాలల మాయలో పడి మాదిగలను మోసం జేస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి మాదిగలను మోసం చేస్తూనే ఉందని, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన పదవిని కాపాడుకునేందుకు మాలలకు భయపడి మాదిగల ద్రోహిగా మారారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని ఎండగడ్తామని ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలను, ఉపకులాల ప్రజలను చైతన్య పరిచేందుకు మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 28న సిద్దిపేటలోని వయోల గార్డెన్స్ లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేసేందుకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంధ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.