ప్రకాశం జిల్లా కంభంలో ఎమ్మార్పీయస్ రాష్ట్ర వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య పర్యటించారు. ఈ సందర్భంగా కంభంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మార్పీయస్ రాష్ట్ర వ్యవస్థాపకులు బ్రహ్మయ్య మాట్లాడుతూ… ఇటీవల కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్ లో ఎమ్మార్పీయస్ నాయకులు శాంతియుతంగా చేస్తున్న నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మదర్ తెరిసా కాలనీకి రోడ్డు వేయాలని అలానే అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయించడంతోపాటు నిర్మించాలని తలంపుతో ఎమ్మార్పీయస్ నాయకులు చేస్తుంటే పోలీసులు దురుసుగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని అన్నారు. అంబేద్కర్ విగ్రహం పక్కన బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా కొంతమంది అధికారులను భయపెట్టి అధికారులతో విగ్రహం ఏర్పాటు చేయకుండా కుట్రలు చేస్తున్నారని అన్నారు.
అలా కుట్రలు చేస్తున్నవారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో ప్రతి ఒక్కరు మేధావిగా గుర్తిస్తారని అతనిని ఎంతో గౌరవిస్తారని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరి వాడని అతను ఏదో ఒక వర్గానికి చెందిన వాడని ముద్ర వేయడం తగదని అన్నారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం పక్కన బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తప్పేంటి అని ప్రశ్నించారు.పోలీసులు ఎంఆర్పిఎస్ నాయకులతో ప్రవర్తించిన తీరు అక్రమంగా కేసులు పెట్టడం వంటి చర్యలు ఖండిస్తున్నానని అన్నారు. మాదిగల హక్కులను సాధించేందుకు ఎంతటి పోరాటానికైనా వెనకాడబోమని బ్రహ్మయ్య అన్నారు. అలానే జూలై 7వ తేదీన విజయవాడలోని జింఖానా గ్రౌండ్ లో జరగనున్న మాదిగల జన జాగృతి సభను మాదిగలు అందరూ విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీయస్ రాష్ట్ర నాయకులు షాలెం రాజ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.