ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నివాసంలో ఆయన తాజాగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్డీఓ కూటమిలో చేరిన టీడీపీ-జనసేన-బీజేపీకే తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు.
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆదివారం సమావేశమయ్యారు. ఆ సందర్భంగా 35 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందించారు. ఎస్సీ, మాదిగలకు ప్రాధాన్యతపై ఇరువురు నేతలు చర్చించారు. సమావేశం అనంతరం మాట్లాడిన మందకృష్ణ మాదిగ సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదికకు చంద్రబాబు పలు కీలక హామీలు ఇచ్చారు.
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక మొదటి ప్రాధాన్యతలో మందకృష్ణ తన ముందు ఉంచిన అన్ని వినతులను పరిష్కరిస్తామని చంద్రబాబు తెలిపారు. తమ కూటమి అధికారంలోకి వచ్చిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణకు అనుకూలంగా బిల్లు ప్రవేశ పెడతామని హామీ ఇచ్చారు. మాదిగల అభ్యున్నత కోసం కృషి చేయాలని కోరగా.. దానికి చంద్రబాబు ఓకే చెప్పారని మందకృష్ణ తెలిపారు. దీంతో పాటుగా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజుకు ప్రత్యామ్మాయం చూడాలని చంద్రబాబును మందకృష్ణ మాదిగ కోరారు.
వర్గీకరణ విషయంతో సీఎం జగన్ మాదిగలకు మోసం చేశారని మందకృష్ణ మండిపడ్డారు. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం కనీసం లాయర్ ను కూడా పెట్టలేదని అన్నారు. మాదిగల సంక్షేమం కోసం జగన్ పట్టికోకుండా గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
మాదిగలంతా కూటమి గెలుపుకోసం పనిచేస్తున్నారని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఈ నెల 30న తేదీన గుంటూరులో ఎన్నికల ప్రచార సరళిపై రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. 29 రిజర్వడు స్థానాల్లో జగన్ కేవలం 10 స్థానాలు మాత్రమే ఇచ్చాడని.. అదే చంద్రబాబు అయితే 14 సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అందుకే గ్రామస్థాయి నుంచి ఇంటింటింకీ కూటమి గెలుపు కోసం ప్రచారం చేస్తామన్నారు.