హైదరాబాద్: తెలంగాణలో మునగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతోంది. అన్ని రాజకీయ పార్టీల నేతలు మునుగోడు ప్రచారంలో బిజీగా ఉన్నారు. మరోవైపు.. మునుగోడు ఓటర్ల జాబితాపై గందరగోళ పరిస్థితి నెలకొంది. ఓటర్ లిస్ట్‌లో కొత్త ఓటర్ల నమోదుపై బీజేపీ.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
కాగా, విచారణ సందర్భంగా హైకోర్ట్ ఓటర్ల జాబితాను కోర్టుకు సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో, ఈసీ ఓటర్ జాబితాను కోర్టుకు సమర్పించింది. ఈ సందర్భంగా 25వేల ఓట్లలో 12వేలు నిర్ధారించినట్టు, మరో 7వేలు తిరస్కరించినట్టు ఈసీ పేర్కొంది. దీంతో, పెండింగ్‌లో ఉన్న ఓటర్ జాబితాను నిలిపేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణను ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది.