హైదరాబాద్ : సినీ హీరో నాగార్జునపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్-కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భాస్కరరెడ్డి పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు లీగల్ ఒపీనియన్‌కు పంపారు. నాగార్జున చెరువును ఆక్రమించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని, చట్టాలను ఉల్లంఘించారని భాస్కర రెడ్డి ఫిర్యాదులో తెలిపారు. అక్కినేని నాగార్జునకు సంబంధించి.. హైదరాబాద్ మాదాపూర్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు కూల్చి వేసిన సంగతి తెలిసిందే. తుమ్మడికుంట చెరువులోని ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో భూమిని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని తెలిపారు. అంతేకాకుండా ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ అనుమతులు కూడా లేవని వెల్లడించారు. అయితే నాగార్జునకు మొత్తం పదెకరాల స్థలం ఉంటే.. అందులోని మూడు ఎకరాలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోకి వస్తోందని తెలిపారు. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఎకరం 12 గుంటలు.. బఫర్ జోన్ పరిధిలోని 2 ఎకరాల 18 గుంటల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించినట్టు ఏవీ రంగనాథ్ వివరించారు. అయితే.. నాగార్జున మాత్రం తాను పూర్తి అనుమతులతోనే కట్టామని.. అది పట్టా భూమి అని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే