నల్సార్ పత్రికా ప్రకటన :అందరికీ అన్నం పెట్టే రైతులకు చట్టాన్ని చుట్టం చేసేందుకు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం నడుం బిగించింది. దుక్కి దున్నే దగ్గరనుండి పండిన పంట అమ్ముకునే దాకా రైతులకు అనునిత్యం చట్టాలతో అవసరం పడుతుంది. రాష్ట్రంలో సాగు చట్టాలు రెండు వందలకు పైగా ఉన్నాయి. ఈ చట్టాలపై రైతులకు కొంత అవగాహన, అవసరమైనప్పుడు ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం అందించే అవసరం రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రైతులకు న్యాయ సేవలను అందించడం కోసం నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం నేడు లీఫ్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
దేశంలోనే అత్యుత్తమ న్యాయ విశ్వవిద్యాలయంగా పేరెన్నికగన్న నల్సార్ సుశిక్షితులైన న్యాయ నిపుణులను తయారు చేయడమే కాదు మారుమూల పల్లెల్లో కూడా యువతీ యువకులకు పారాలీగల్ శిక్షణ ఇచ్చింది. వీరి ద్వారా పది లక్షల మంది పేదల భూమి సమస్యలు పరిష్కారం అయ్యాయి. ప్రొఫెసర్ బాలకిస్టా రెడ్డి సారథ్యంలో నడుస్తున్న నల్సార్ భూమి హక్కుల కేంద్రం, తొమ్మిది గ్రామాలలో ప్రజల భాగస్వామ్యంతో భూవివాదాలను పరిష్కరించింది. వరంగల్ జిల్లా కోర్టు ప్రాంగణం లో భూమి హక్కుల క్లినిక్ ఏర్పాటు జరిగింది. వేలమందికి శిక్షణా తరగతులు నిర్వహించింది. భూ చట్టాల సమీక్ష లో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు రైతులకు సాగు న్యాయం అందించే ప్రయత్నం ప్రారంభిస్తుంది.
పద్దెనిమిది ఏండ్ల క్రితం నల్సార్ నుండి లా పట్టా పొందిన నాటి నుండి రైతుల కోసం విశేష కృషి చేస్తూ భూమి సునీల్ గా పేరుతెచ్చుకున్న నల్సార్ పూర్వ విద్యార్ధి సునీల్ కుమార్ ఇప్పటి వరకు నల్సార్ భూమి హక్కుల కేంద్రం నిర్వహించిన కార్యక్రమాలలో కీలక పాత్ర పోషించాడు. తను సారథ్యం వహిస్తున్న లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) సంస్థ రైతులకు చట్టాన్ని చుట్టం చేయడం కోసం విశేష కృషి చేస్తుంది. భూమి హక్కుల పరీక్షా కేంద్రం, సాగు న్యాయం, భూన్యాయ శిబిరాలు, సాగు చట్టాలు, మీ భూమి మీ హక్కు, న్యాయ గంట, సాగు న్యాయ నేస్తం లాంటి పలు కార్యక్రమాలతో రైతులకు అండగా నిలుస్తుంది.
నల్సార్, లీఫ్స్ సంస్థలు కలిసి రాబోయే రోజులలో రైతుల కోసం పలు కార్యక్రమాలు నిర్వహించబోతున్నాయి . గ్రామీణ యువతకు వ్యవసాయ చట్టాలపై శిక్షణ, సాగు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు, పల్లెల్లో సాగు న్యాయ శిబిరాలు లాంటి పలు కార్యక్రమాల నిర్వహణ కోసం ఈ రోజు ఈ రెండు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కార్యక్రమంలో లీఫ్స్ సంస్థ ఉపాధ్యక్షులు జీవన్, నల్సార్ అధ్యాపకులు డాక్టర్ బాలకృష్ణ, మల్లిఖార్జున్, రీసెర్చ్ అసోసియేట్స్ శివచరణ్, జ్యోతి, న్యాయవాది మల్లేష్ పాల్గొన్నారు.