Gang Rape Of Minor Girl In Nandyala: దేశ వ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల తీరు మారడం లేదు. రోజురోజుకు అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ తరుణంలో కన్న బిడ్డలను కాపాడుకోవడం తల్లిదండ్రులకు కత్తిమీద సాములాగా మారింది. తాజాగా, నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లాల గ్రామంలో జరిగిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.
నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి ఆపై హత్యకు ఒడిగట్టారు. ఈ ఘటనలో ముగ్గురు బాలురు నిందితులుగా ఉన్నారు. ఈ ఘటనతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కనీసం పదో తరగతి కూడా చదవని ఈ మైనర్లు ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేయడం కలకలం రేపుతోంది.
ముచ్చుముర్రిలోని పార్క్‌కు స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వెళ్లిన బాలిక అదృశ్యమైంది. దీంతో సాయంత్రం నుంచి తమ పాప కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే, ఈ విషయం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి తెలియగా.. బాలిక ఆచూకీని గుర్తించాలని పోలీసులను ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాలిక మిస్సింగ్ కేసును ఛేదించేందుకు మూడు బృందాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు గాలింపు చర్యలు చేపట్టారు.
జూపాడు బంగ్లా, మిడుతూరు, ముచ్చుముర్రి, బ్రాహ్మణ కొట్కూరు ప్రాంతాల్లో పోలీసులు జాగిలంతో గాలించారు. ఈ జాగిలం ముచ్చుమర్రి పార్క్ నుంచి ఎత్తిపోతల పథకం పరిసరాల్లో తిరిగి పంపుహౌస్ వద్ద ఆగిపోయింది. అయితే సాయంత్రం ఒంటరిగా పార్కులో ఆడుకుంటున్న బాలికను ముగ్గురు బాలురు ఆ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత విషయం బయటకు వస్తుందని ఆపై కాల్వల్లోకి తోసేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈ ఘటనలో 14 నుంచి 16 ఏళ్ల మధ్య ఉన్న ముగ్గురి మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అసలు విషయం బయటకువచ్చింది. తామే బాలికను అత్యాచారంతోపాటు హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. కాల్వలో నీటి ప్రవాహం ఉండటంతో బాలిక ఆచూకీ దొరకడం లేదు. ప్రస్తతుం ముచ్చుముర్రి పంప్ హౌస్ వద్ద బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.