తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గంలోని పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రధాన లక్ష్యంగా ఎంచుకున్నట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి రూరల్ మండలంలోని వెంకటపతి నగర్ లో సోమవారం స్విమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో యంయల్ఏ నాని పాల‌్గొన‌్నారు. వైద్యులు ప్రజలకు ఉచితంగా వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్యం అవసరమైన వారిని గుర్తించి ఆసుపత్రికి రెఫర్ చేసారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున నియోజకవర్గంలోని అన్ని మండలాలలో వీలైనన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన‌్న తన కోరికను మన‌్నించి చర్యలు చేపట్టిన స్కీమ్స్ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ రవికుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రగిరిని ఆరోగ్యకర నియోజకవర్గంగా రూపొందించటానికి అందరి సహకారం తీసుకొంటున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించడానికి సిమ్స్ ఆస్పత్రి సహకారం కావాలన్నారు. ఎవరికైనా వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చు అయితే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా తాను నిధులు మంజూరు చేయించడానికి కృషి చేయనున్నట్లు చెప్పారు.
చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజలు ఎప్పటికప్పుడు పరిసరాల పారిశుధ్యం వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాకాలం ప్రారంభమైన దృష్ట‌్యా ప్రతి ఒక్కరూ వైద్యులు చెప్పే సూచనలను పాటిస్తూ తగు జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. ఈ వైద్య శిబిరంలో స‌్విమ్స్ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ రవి కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కోరిక మేరకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆధునిక వైద్య యంత్రాలు అందుబాటులో ఉన్నాయని ప్రతి ఒక్కరూ సిమ్స్ నందు అవసరమగు చికిత్సలను పొంది ఆరోగ్యవంతులు కావాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో పెద్ద మొత్తంలో ప్రజలు పాల్గొని పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.