తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, తొండవాడ సమీపంలో ఏర్పాటు చేసిన ఏపీ హౌసింగ్ కాలనీలో చోటు చేసుకున్న అవినీతిని గుర్తించి వెలికి తీయాలని, పట్టాలు పొందిన బినామీలను గుర్తించాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులను ఆదేశించారు. అధికారులతో కలిసి ఎమ్మెల్యే పులివర్తి నాని తొండవాడ హౌసింగ్ కాలనీని సందర్శించారు. ఏపీ హౌసింగ్ కాలనీ లో అధికారులతో ఎంఎల్ఏ పులివర్తి నాని సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రజల వద్ద ఎంఎల్ఏ నాని వినతులు స్వీకరించారు. తొండవాడ హౌసింగ్ కాలనీ లో చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాలకు సంబంధించిన వారికి మొత్తం ఎన్ని ఇండ్లు మంజూరు చేశారో వివరాలు ఇవ‌్వాలన‌్నారు. హౌసింగ్ కాలనీలో వీధి లైట్లు, డ్రైనేజీ, రోడ్,నీటి సమస్యలు ఎంఎల్ఏకు స్థానికులు వివరించారు. బినామీల పేర్లతో వున్న ఇండ్లను తక్షణమే గుర్తించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ పేద ప్రజలకు ఇండ్లు ఇమ్మని చెప్పినా,అధికారుల తీరు మారలేదని ఆగ‌్రహం వ‌్యక‌్తం చేసారు. ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారకపోవడం సరికాదన్నారు. అనంతరం ఎంఎల్ఏ పులివర్తి నాని అధికారులతో కలిసి హౌసింగ్ కాలనీ అంతా పరిశీలించారు. ఇప్పటివరకు జియో ట్యాగ్ చేయని వారికి ప్రతి ఇంటికి వెళ్లి ఇంటి హక్కుదారుల వివరాలు అడిగి తెలుసుకుని దగ్గరుండి జియో ట్యాగ్ చేయించారు. త్వరగా పనులు చేపట్టాలని అధికారులకు దిశ నిర్దేశం చేశారు. ఏపీ హౌసింగ్ కాలనీని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయించి త్వరితగతిన అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయటానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పులివర్తి నాని కాలనీవాసుల ముందు ప్రకటించారు. ఇందుకోసం కార్యచరణ రూపొందించడానికి అధికారులతో చర్చించారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈలు, చంద్రగిరి తిరుపతి రూరల్ ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, సిబ్బంది పాల్గొన్నారు.