వెయ్యి మంది బాలయ్యలు, వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి.. అయితే, ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో చేసుకున్న ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.. ఇదే నందమూరి ఫ్యామిలీలో ఉన్న వివాదాలకు ఉదాహరణ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. ఈ రోజు ఉదయమే జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించగా.. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు.. అయితే, అక్కడ ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసేయ్.. ఇప్పుడే అంటూ బాలయ్య ఆదేశాలు ఇచ్చినట్టు ఉన్న ఓ వీడియో వైరల్‌గా మారింది.. ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడం చర్చగా మారింది. దీనిపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు కొడాల నాని.. బాలయ్య లాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరని వార్నింగ్ ఇచ్చారు..
గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన కొడాలి నాని.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మానసిక వేదనతో చనిపోయారు. ఎన్టీఆర్ పనికి రాడన్న గజ దొంగ చంద్రబాబు అని.. ఆ చంద్రబాబే ఇప్పుడు ఎన్టీఆర్ బూట్లు నాకుతున్నారని దుయ్యబట్టారు. చంపిన వ్యక్తులే ఎన్టీఆర్‌ను పొగుడుతూ.. కీర్తిస్తున్నారు. టీడీపీ నేతలు ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు రా కదిలి రా అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతుందని సెటైర్లు వేశారు. అల్లుడి నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తొలగిస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో పెద్ద ఎన్టీఆర్‌ను దించిన బాలయ్య.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారని ఎద్దేవా చేశారు.. అంతే కాదు.. వెయ్యి మంది బాలకృష్ణలు, వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినా.. జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయిన వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని..