contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

లోకేశ్ పాదయాత్ర 28వ రోజు హైలైట్స్

నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 28వ రోజు (ఆదివారం) చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తిరుపతి రూరల్ మండలంలో కొనసాగింది. తిరుచానూరు సర్కిల్ లో పాదయాత్ర ప్రారంభానికి ముందు సెల్ఫీ విత్ లోకేశ్ కార్యక్రమంలో భాగంగా తనను కలిసేందుకు వచ్చిన యువతీయువకులతో యువనేత ఫోటోలు దిగారు. ఎవరినీ నిరాశపర్చకుండా అందరికీ ఓపిగ్గా సెల్ఫీలు ఇచ్చారు.

తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేదపండితులు యువనేతకు ఆశీర్వచనాలు అందించారు. దుర్గసముద్రంలో స్థానికులు యువనేతను గజమాలతో సత్కరించి నాగలిని బహుకరించారు.

బీసీలతో ముఖాముఖి

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని నియోజకవర్గాల్లో బీసీ భవనాల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తామని లోకేశ్ పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గం భాగ్యనగర్ లో బీసీలతో లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… జగన్ రద్దు చేసిన బీసీ సంక్షేమ పథకాలన్నింటినీ అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్దరిస్తామని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సత్యపాల్ కమిటీ నివేదిక ఆధారంగా వడ్డెర్లకు న్యాయం చేస్తామని, వారి పిల్లలకు మంచి నాణ్యమైన విద్యనందిస్తామని భరోసా ఇచ్చారు. ఉద్యోగం, ఉపాధి, పారిశ్రామికవేత్తలుగా మారడానికి అవకాశాలన్నీ కల్పిస్తామని అన్నారు.

“విద్యాపరంగా బీసీలకు ప్రత్యేకంగా ఫీజు రీయింబర్స్ చంద్రబాబు తీసుకొచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వసతి దీవెన, విద్యా దీవెన పేరుతో 10 వేలు వేసి రూ.22 వేలు ఎగ్గొట్టారు” అని ఆరోపించారు.

చంద్రన్న బీమా మళ్లీ తీసుకువస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. చంద్రన్న బీమా అనేక కుటుంబాలను నిలబెట్టిందని తెలిపారు. కానీ జగన్ ఆ పథకానికి పేరు మార్చుకుని… డబ్బులు ఎగ్గొట్టి తండ్రి పరువు తీశారని విమర్శించారు.

యాదవ మేయర్ ను అవమానిస్తున్నారు!

తిరుపతి మేయర్ గా యాదవ సోదరీమణి ఉందని, కానీ ఆమెను పనిచేయకుండా అభినయ్ రెడ్డి అడ్డంకులు పెడుతున్నారని లోకేశ్ ఆరోపించారు. “పదవి ఇవ్వడం కాదు… గౌరవం ఇవ్వాలి. తిరుపతి మేయర్ ను డమ్మీని చేసి అవమానిస్తున్నారు” అని మండిపడ్డారు.

వడ్డెర్ల స్థితిగతులు మారుస్తాం!

వైసీపీ ప్రభుత్వ విధానాలపై వడ్డెర్లు మాట్లాడలేకపోతున్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాక అనంతజిల్లాలో క్వారీలు వడ్డెర్లకు కేటాయించారని వెల్లడించారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి వడ్డెర్ల మైన్ లు లాక్కుని ధనవంతులకు ఇచ్చారని లోకేశ్ ఆరోపించారు.

“వడ్డెర్లకు ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ.60 కోట్లు ఖర్చు చేశాం. ఈ ప్రభుత్వం మీ గురించి పార్లమెంట్ లో మాట్లాడటం లేదు. ఎస్టీల్లో కొన్ని కులాలను కలిపారు. కానీ మన రాష్ట్రంలో తీర్మానం కూడా చేయలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వడ్డెర్ల స్థితిగతులు మారుస్తాం” అని స్పష్టమైన భరోసా ఇచ్చారు.

కొట్టుకుపోయిన లోలెవల్ కాజ్ వేను పరిశీలించిన లోకేశ్

తనపల్లిలో వరదలకు కొట్టుకుపోయిన లెవల్ కాజ్ వేని లోకేశ్ పరిశీలించారు. అసమర్థ వైసీపీ పాలన, అవగాహన లేని సీఎం జగన్ వలనే ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. వర్షాకాలంలో కనీస అంచనాలు లేకుండా జగన్ ప్యాలస్ లో పడుకోవడం వలన అన్నమయ్య డ్యాం కొట్టుకు పోయి 60 మంది నిండుప్రాణాలు బలయ్యాయని పేర్కొన్నారు. నీటి నిర్వహణలో జగన్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తామని, పటిష్టంగా కాజ్ వే లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

లోకేశ్ ను కలిసిన ప్రభుత్వ ఉపాధ్యాయులు

చంద్రగిరి నియోజకవర్గం భాగ్యనగర్ లో లోకేశ్ ను ఏపీటీఎఫ్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ… భావిభారత పౌరులను తయారుచేసే ఉపాధ్యాయులను ఇదివరకెన్నడూ లేని విధంగా వేధింపులకు గురిచేస్తున్న రాక్షసుడు జగన్ మోహన్ రెడ్డి అని నిప్పులు చెరిగారు. పవిత్రమైన వృత్తిలో ఉన్న గురువులతో మందుషాపుల వద్ద కాపలా పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ హక్కుల కోసం న్యాయపోరాటం చేస్తున్న టీచర్లపై ఉగ్రవాదుల మాదిరిగా తప్పుడు కేసులుపెట్టి వేధించిన ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని, టీచర్లు ఎటువంటి వేధింపులు లేకుండా స్వేచ్చగా పనిచేసుకునే వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు:
ఇప్పటి వరకు నడిచిన దూరం కి.మీ. 367.3 కి.మీ

28వరోజు (ఆదివారం) నడిచిన దూరం – 13.2 కి.మీ

యువగళం పాదయాత్ర 29వ రోజు షెడ్యూల్ (27-2-2023)
చంద్రగిరి నియోజకవర్గం:
ఉదయం
8.00 – చంద్రగిరి మండలం శివగిరి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.15 – శానంబట్ల గ్రామంలో స్థానికులతో మాటామంతీ.
10.20 – పిచ్చినాయుడుపల్లిలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.
10.45 – తొండవాడ బహిరంగసభలో యువనేత ప్రసంగం.
11.45 – తొండవాడలో భోజన విరామం.
మధ్యాహ్నం
12.45 – భోజన విరామ ప్రాంతంలో స్థానికనేతలతో అంతర్గత సమావేశం.
3.00 – తొండవాడనుంచి పాదయాత్ర కొనసాగింపు.
సాయంత్రం
4.30 – చంద్రగిరి టవర్ క్లాక్ జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ.
5.05 – చంద్రగిరి నూర్ జంక్షన్ లో స్థానికులతో భేటీ.
6.55 – ఇత్తెపల్లిలో స్థానికులతో మాటామంతీ.
7.45 – మామందూరు విడిది కేంద్రంలో బస.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :