టీడీపీ యువనేత నారా లోకేశ్ మంగళగిరి శాసన సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. లోకేశ్ తరపున కూటమి నేతలు ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్యనేతలు లోకేశ్ తరపున 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కూటమికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. మధ్యాహ్నం 2.34 గంటలకు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నామినేషన్ వేయనున్నారు. మంగళగిరిలో సర్వమత ప్రార్థనల తర్వాత భారీ ర్యాలీ ప్రారంభం కానుంది. నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. నియోజకవర్గం నుంచి 10 వేల మందికి పైగా కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
ఈరోజు నుంచి ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 26న నామినేషన్లు పరిశీలిస్తారు. 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు వీలుంటుంది.