contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

చంద్రబాబును రిమాండ్ కు పంపడానికి వ్యవస్థను మ్యానేజ్ చేస్తున్నారు : నారా లోకేష్

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబును ఈ సాయంత్రం నారా లోకేశ్, నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ములాఖత్ ద్వారా కలుసుకున్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాను బాగానే ఉన్నానని, మీరు ధైర్యంగా ఉండాలని, ప్రజలకు ధైర్యం చెప్పాలని చంద్రబాబు కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేసుకు సంబంధించిన వివరాలు కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

ములాఖత్ ముగిసిన అనంతరం నారా లోకేశ్ జైలు వెలుపల మీడియాతో మాట్లాడారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును రిమాండ్ కు పంపారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దొంగ కేసు బనాయించి చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ కు పంపి ఈ రోజుతో 28 రోజులు అని వెల్లడించారు.

“పోలవరం గురించి మాట్లాడినందుకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా పరిశ్రమలు తీసుకురండి అని అడిగినందుకు, ఏపీకి రావాల్సిన జలాల కోసం పోరాడండి అని చెప్పినందుకే ఆయనను జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించారు. ఇసుక, మద్యం, మైనింగ్ అవినీతిపై ప్రశ్నించినందుకు చంద్రబాబును రిమాండ్ కు పంపారు.

ఆయనను అరెస్ట్ చేసే ముందు రూ.3 వేల కోట్ల స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం అన్నారు. ఆ తర్వాత రూ.371 కోట్లు అని మాట మార్చారు. నిన్న కోర్టులో రూ.27 కోట్ల అవినీతి జరిగిందని మళ్లీ మాట మార్చారు. చంద్రబాబు ప్రజల తరఫున పోరాడుతున్నారన్న కారణంతోనే ఆయనను రిమాండ్ కు పంపారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, దాదాపు 14 ఏళ్లు విపక్షనేతగా… నిరంతరం ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి చంద్రబాబును తప్పుడు కేసులతో జ్యుడిషియల్ రిమాండ్ కు పంపారు. న్యాయం ఆలస్యం కావొచ్చేమో కానీ, న్యాయం జరగడం మాత్రం తథ్యం. న్యాయం తప్పకుండా మావైపు నిలబడుతుంది.

కుటుంబం కోసం 1992లో పరిశ్రమ స్థాపించి, తల్లి భువనేశ్వరి, 2013 నుంచి అర్ధాంగి బ్రాహ్మణి నీతి నిజాయతీగా పనిచేసి సంపాదిస్తే, ఆ డబ్బును మేం ఖర్చుపెట్టి రాజకీయాలు చేశాం. గత పదేళ్లుగా దేశంలో ఏ కుటుంబం చేయని విధంగా మా ఆస్తులను మేమే స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నాం. మాకున్న ప్రతి ఎకరం, ప్రతి రూపాయిని ప్రజల ముందుంచాం. దాంట్లో ఒక్కటి కూడా తప్పని నిరూపించలేకపోయింది ఈ ప్రభుత్వం. మేం తప్పు చేశామని నిరూపిస్తే మా ఆస్తులన్నీ రాసిచ్చేస్తామని గతంలోనే సవాల్ చేశాను… ఎక్కడా నిరూపించలేకపోయారు.

గతంలో షెల్ కంపెనీలన్నారు… వేల కోట్ల కుంభకోణం అన్నారు… ఇప్పుడు రూ.27 కోట్లు టీడీపీకి వెళ్లాయంటున్నారు. ఇంకో వారం పోతే సున్నా అంటారు… అసలు అవినీతి జరగలేదని చెబుతారు… ఎందుకంటే మేం ఏనాడూ అవినీతి చేయలేదు కాబట్టి.

తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ ఉన్న పార్టీ. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు అందరం పద్థతిగా నడిచాం. టీడీపీ సభ్యత్వాల ద్వారా వసూలు చేసిన రుసుంను ఎక్కడికక్కడ బ్రాంచిల్లో డిపాజిట్ చేశాం. ఆ డబ్బులే టీడీపీ ప్రధాన ఖాతాకు బదలాయించడం జరిగింది. కార్యకర్తలకు ఇచ్చిన హామీ మేరకు రూ.110 కోట్ల ప్రమాద బీమా కూడా అందించాం. మేం తీసుకువచ్చిన ఈ బీమా విధానాన్ని చాలా పార్టీలు కాపీ కొట్టాయి.

ఆ రోజున చంద్రబాబు చిటికె వేసుంటే ఈ జగన్ రోడ్ల మీద తిరిగేవాడా? పాదయాత్ర చేయగలిగేవాడా? ఇవాళ నేను రోడ్డుమార్గంలో వస్తుంటే మా నాయకులను అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎందుకయ్యా మీకంత భయం? టీడీపీ అన్నా, మా పార్టీ నేతలన్నా, పసుపు జెండా అన్నా ఎందుకంత భయపడుతున్నారు?

చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత నాపై కూడా అనేక ఆరోపణలు చేశారు. కానీ మొన్న కోర్టులో ఏంచెప్పారు?… ఫైబర్ గ్రిడ్ లో లోకేశ్ పాత్ర ఏమీ లేదు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏవైనా ఆధారాలు ఉంటే 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తాం… సహకరించాలి అని ఈ ప్రభుత్వం చెప్పింది.

ప్రజలంతా ఆలోచించాలి. మీ ఆశీస్సుల వల్ల 1982 నుంచి టీడీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా సేవలు అందించింది. అన్యాయం జరిగితే ఎదుర్కోవడంలో టీడీపీ ముందుంటుంది. ఇవాళ కూడా చంద్రబాబు… ఎట్టి పరిస్థితుల్లోనూ పోరాటం ఆపొద్దు అని మాతో చెప్పారు. కానీ శాంతియుతంగా పోరాడాలని అన్నారు.

28 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నప్పటికీ చంద్రబాబు అధైర్యపడడంలేదు. నేను తప్పు చేసినా నన్ను జైలుకు పంపే మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు. తప్పుడు కేసులకు మేం భయపడబోం. న్యాయపోరాటం కొనసాగుతుంది. ఇవాళ ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ పై తీర్పు సోమవారానికి వాయిదా వేశారు. 17ఏ విషయంలోనూ మేం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాం. అది కూడా సోమవారం నాడు విచారణకు వస్తుంది.

అంతేగాకుండా, రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ పిలుపునిచ్చాం… శనివారం రాత్రి 7 గంటలకు ఇంట్లో లైట్లన్నీ ఆపేసి, ఇంటి ముందుకు వచ్చి కొవ్వొత్తి కానీ, సెల్ ఫోన్ లైట్ కానీ, కాగడాలు కానీ వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చాం” అని లోకేశ్ వివరించారు.

Lava Blaze 5G (Glass Green, 8GB RAM, UFS 2.2 128GB Storage) | 5G Ready | 50MP AI Triple Camera –  Deal Price : ₹11,999 – M.R.P.: ₹16,499
https://amzn.to/46HN87z 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :