contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఢిల్లీలో దీక్ష విరమించిన నారా లోకేశ్ … మరో మూడు కేసులు రెడీ చేశారు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఒక్క రోజు నిరాహార దీక్ష విరమించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా లోకేశ్ ఇవాళ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. ఈ సాయంత్రం 5 గంటలకు దీక్ష ముగించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఏపీలో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో, ఇతర రాష్ట్రాల్లో అమలైన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టును చంద్రబాబు మన రాష్ట్రంలో కూడా తీసుకువచ్చారని వెల్లడించారు. 2.15 లక్షల మందికి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి, అందులో 80 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు.

చంద్రబాబు నాడు యుద్ధప్రాతిపదికన పనిచేశారు కాబట్టే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని, కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దొంగకేసులు పెట్టి చంద్రబాబును జైలుకు పంపాలనే ప్రయత్నించిందని లోకేశ్ విమర్శించారు. ఏమీలేని స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో చంద్రబాబుపై దొంగ కేసు బనాయించి ఇవాళ్టికి 24 రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచారని వెల్లడించారు.

45 ఏళ్లుగా ప్రజాసేవ కోసం అనేక త్యాగాలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని ప్రజలు గుర్తించాలని, ఆనాడు సైబరాబాద్ గానీ, అమరావతి గానీ, విశాఖపట్నం గానీ, రాయలసీమలో అనంతపూర్, కర్నూలు, కడప, చిత్తూరును పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది చంద్రబాబేనని వివరించారు. అన్ని మంచి పనులు చేశారు కాబట్టే ఇవాళ ఈ సైకో జగన్ ఆయనను జైలుకు పంపించాడని లోకేశ్ మండిపడ్డారు.

చంద్రబాబు అరెస్టయినప్పటి నుంచి ప్రజలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, మొన్న మోత మోగిద్దాం కార్యక్రమంలో సామాన్యులు కూడా పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేశారని వెల్లడించారు.

“మొన్న టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించుకున్నాం. అందులో భువనేశ్వరమ్మ గారు మీరందరూ ఒప్పుకుంటే అక్టోబరు 2న నిరాహార దీక్ష చేయాలనుకుంటున్నానని వెల్లడించారు. దాంతో మేమందరం కూడా ఆమెకు సంఘీభావం తెలుపుతూ దీక్షలు చేపట్టాం. ఢిల్లీలో, ఏపీలోని 175 నియోజకవర్గాల్లో, పొరుగు రాష్ట్రాల్లో కూడా ఒక్క రోజు నిరాహార దీక్షలు జరిపారు.

గత 24 రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూసిన తర్వాత నేను జగన్ పేరు మార్చాను… సైకో జగన్ కాదు పిచ్చి జగన్! స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏవైనా ఆధారాలు ఉంటే జడ్జి ముందు పెట్టాలి… కానీ వీళ్లు అలా చేయడంలేదు.

ఆయనకు ఈ కేసులో ఎక్కడ బెయిల్ వస్తుందోనని, మరో దొంగ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ రెడీగా పెట్టుకున్నారు. పిచ్చి జగన్ ఆలోచన ఇది. ఇలా మూడు కేసులు రెడీ చేశారు. నన్ను జైలుకు పంపిస్తామంటున్నారు, బ్రాహ్మణిని, భువనేశ్వరమ్మను కూడా జైలుకు పంపిస్తామంటున్నారు… ఇది కక్ష సాధింపు తప్ప మరొకటి కాదు. ఏ తప్పు చేయని చంద్రబాబును 24 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచడం చాలా బాధాకరం. టీడీపీ పోరాటం కొనసాగుతుంది… తగ్గేదే లే…” అంటూ వ్యాఖ్యానించారు.

కాగా, రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ జరగనుందని లోకేశ్ వెల్లడించారు. ఐటెం నెం.62 కింద ఈ పిటిషన్ వస్తోందని వివరించారు. కోర్టు నిర్ణయాలను బట్టి తమ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఆధారపడి ఉంటుందని అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :