ప్రకాశం జిల్లాలో కొండెపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి నివాసంపై వైసీపీ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారన్న వార్తల నేపథ్యంలో టీడీపీ అధినాయకత్వం భగ్గుమంటోంది. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి నిన్న వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యల ఫలితంగానే బాల వీరాంజనేయస్వామి నివాసంపై దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్ ద్వారా బాల వీరాంజనేయస్వామిని పరామర్శించారు.
తాజాగా, ఈ వ్యవహారంపై నారా లోకేశ్ నేరుగా బాలినేనిని టార్గెట్ చేసి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ‘హవాలా కింగ్ బాలినేని, నీ దాదాగిరీకి ఎక్స్ పైరీ డేట్ దగ్గరపడిందని’ హెచ్చరించారు. ‘నీ అవినీతిని ప్రశ్నిస్తే విద్యావంతుడు, దళిత మేధావి అయిన కొండెపి ఎమ్మెల్యే డాక్టర్ స్వామి ఇంటిపైకి రౌడీ మూకల్ని పంపుతావా?’ అంటూ మండిపడ్డారు.
అవినీతి చీడపురుగువి నీకే అంత పౌరుషం ఉంటే… అంటూ నిప్పులు చెరిగారు. ‘నీతికి నిలువుటద్దం వంటి మా స్వామి గారి ఇంటిపైకి దాడికి వచ్చిన మిమ్మల్నేం చేసినా పాపం లేదు’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాణాలు తీసే కిల్లర్ గేంబ్లర్ బాలినేని వాసూ… మా డాక్టర్ జోలికొస్తే ఖబడ్దార్ అంటూ లోకేశ్ ఘాటుగా స్పందించారు.