- రేణుకా చౌదరి, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, సుదర్శన్ రెడ్డిలకు నోటీసులు
- శుక్రవారం ఉదయానికి ఢిల్లీ చేరిన నేతలు
నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీపీసీసీ)కి చెందిన ఐదుగురు సీనియర్ నేతలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈడీ నోటీసులు అందుకున్న తెలంగాణ నేతలంతా శుక్రవారం ఉదయానికి ఢిల్లీ చేరుకున్నారు. వీరిలో కొందరు గురువారం రాత్రికే ఢిల్లీ చేరుకోగా… మరికొందరు శుక్రవారం ఉదయం హస్తిన చేరారు. ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీ వచ్చేయాలన్న అధిష్ఠానం ఆదేశాల మేరకే వారంతా ఢిల్లీ చేరుకున్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు అగ్ర నేత రాహుల్ గాంధీని కూడా విచారించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పార్టీతో పాటు పార్టీ అనుబంధ సంస్థలకు విరాళాలు ఇచ్చిన నేతలపై దృష్టి సారించిన ఈడీ… తెలంగాణకు చెందిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 10న ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ వీరిని ఈడీ కోరిన సంగతి తెలిసిందే.
నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటి?.. దాని పూర్వాపరాలు, దర్యాప్తులో భాగంగా ఈడీ అడుగుతున్న ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సంబంధించిన వివరాలు.. సోనియా, రాహుల్ విచారణలలో ఈడీ అధికారులు సంధించిన ప్రశ్నలు, వాటికి సోనియా, రాహుల్ చెప్పిన సమాధానాలు, భవిష్యత్తులో ఎదురు కానున్న సమస్యలపై అవగాహన కల్పించేందుకే తెలంగాణ నేతలను అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే ఢిల్లీ చేరిన నేతలకు పార్టీకి చెందిన ఆడిటర్లతో సమావేశం ఏర్పాటు చేయించే దిశగా అధిష్ఠానం చర్యలు చేపడుతోంది.