ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే వేళాయింది. సుమూహుర్తం ఖరారైంది. ఈ నెల 12.. బుధవారం. ఉదయం 11.27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సం చేస్తారు. గన్నవరం పరిధిలోని కేసరపల్లి ఐటీపార్క్ సమీపంలోని సువిశాల ప్రాంతంలో ప్రమాణస్వీకార సభా ఏర్పాట్లు జోరందుకున్నాయి. ప్రమాణస్వీకారోత్సవ వేడుక అమరావతిలోనే . వేదిక తాడేపల్లిలో అనే ప్రచారం జరిగింది. రాయపూడి లేదంటే ఉద్దండ్రాయునిపాలెం పేర్లు కూడా విన్పించాయి. ఆ తరువాత బ్రహ్మానందపురం పేరు తెరపైకి వచ్చింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలు, అధికారులతో కలిసి బ్రహ్మానందపురంలో స్థలాన్ని పరిశీలించారు. సభా నిర్వహణకు స్థలం విశాలంగానే ఉన్నప్పటికీ రావడానికి వెళ్లడానికి మార్గం ఒకటే ఉండడంతో సుముఖుత వ్యక్తం చేయలేదాయన. మరింత అనువైన ప్రదేశం కోసం ఆరా తీశారు అచ్చెన్నాయుడు.
ఆ క్రమంలోనే గన్నవరం ఏరియాపై దృష్టిసారించారు. ఎట్టకేలకు కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర సువిశాల ప్రదేశాన్ని ఎంపిక చేశారు. పక్కనే హైవే ఉంది. ప్రజలు రావడానికి అనువుగా ఉంటుంది. పైగా ఎయిర్‌పోర్టు కూడా కూతవేటు దూరంలో ఉంది. సో.. వీఐపీల కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా సభా స్థలికి చేరుకోవచ్చు. ఇలా అన్ని విధాల అనువుగా ఉండడంతో ఈ ప్రదేశంలోనే ప్రమాణస్వీకారోత్సవ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. వెనువెంటనే చకాచకా పనులు కూడా ప్రారంభమయ్యాయి.