contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అసమర్థులు పాలన లో విద్యుత్ రంగం దారుణంగా దెబ్బతింది: సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్యాహ్నం రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి అని పిలుపునిచ్చామని… ప్రజలు గెలిచి కూటమిని గొప్ప స్థానంలో నిలబెట్టారని కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. శ్వేతపత్రాల ద్వారా ఆయా శాఖల గురించి ప్రజలందరికీ వాస్తవాలు చెప్పాలన్నదే తమ ప్రయత్నమని చంద్రబాబు స్పష్టం చేశారు. సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు అందుతాయని, బాధ్యతలేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయని వివరించారు. గత ప్రభుత్వం ఎంత నష్టం చేసిందో ప్రజలకు చెబుతున్నామని అన్నారు.

“విద్యుత్ తో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంది. విద్యుత్ రంగంపైనే ప్రజల జీవన ప్రమాణాలు ఆధారపడి ఉన్నాయి. 2014లో తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉంది. ఈ ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. అసమర్థులు పాలన చేస్తే ఇలాగే ఉంటుంది.

1998లో మేం తొలిసారిగా విద్యుత్ సంస్కరణలు అమలు చేశాం. దేశంలోనే మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ ఏపీలోనే వచ్చింది. విద్యుత్ సంస్కరణల వల్ల 2004లో నా అధికారం పోయినా దేశం బాగుపడింది. మేం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణలు దేశవ్యాప్తంగా గణనీయమైన మార్పును తీసుకువచ్చాయి. ఏపీలో 2014 డిసెంబరు నాటికి 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉంది. అక్కడ్నించి సమర్థవంతమైన పవర్ మేనేజ్ మెంట్ తో 2018 జనవరి నాటికి మిగులు విద్యుత్ సాధించాం.

పీక్ డిమాండ్ ను 6,784 మెగావాట్ల నుంచి 9,453 మెగావాట్లకు పెంచాం. వినియోగాన్ని 40,174 మిలియన్ యూనిట్ల నుంచి 54,555 మిలియన్ యూనిట్లకు పెంచాం. అది కూడా ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండానే, ఎలాంటి టారిఫ్ లు పెంచకుండానే, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూనే ఇదంతా సాధించాం.

2004 సమయంలో రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాగా… అంతకుముందు నేను విద్యుత్ రంగ సంస్కరణలతో రాబట్టిన ప్రయోజనాలు ఆయన ప్రభుత్వానికి దక్కాయి. మా హయాంలో రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీసుకువచ్చాం. ఒకటి వీటీపీఎస్, రెండు కృష్ణపట్నం.

ఎనర్జీ ఎఫిషియన్సీలో వరల్డ్ బ్యాంక్ కూడా నెంబర్ వన్ ర్యాంక్ ఇచ్చింది. మా హయాంలో విద్యుత్ రంగానికి మొత్తం 145 అవార్డులు వచ్చాయి. ట్రాన్స్ కో, జెన్ కో సంస్థలకు అనేక అవార్డులు లభించాయి. 2014 నుంచి 2019 వరకు సోలార్ ఎనర్జీ, పవన విద్యుత్ ఉత్పాదనను పెంచాం.

ఇక, వైసీపీ ప్రభుత్వం వచ్చాక చూస్తే… 2019 నుంచి 2024 వరకు ప్రజలపై విపరీతమైన భారం పడింది. వినియోగదారులపై రూ.32,166 కోట్ల భారం మోపారు. ఏపీ విద్యుత్ సంస్థల రుణాలు రూ.49,596 కోట్లకు పెరిగాయి. అసమర్థ పాలన కారణంగా రాష్ట్ర విద్యుత్ రంగానికి రూ.47,741 కోట్ల మేర నష్టాలు వాటిల్లాయి.

గత వైసీపీ ప్రభుత్వం సోలార్ విద్యుత్ ను వాడుకోకుండా, తిరస్కరించింది. దాంతో కోర్టు… అవన్నీ కుదరవు… మీరు చెల్లింపులు చేయాల్సిందేనని స్పష్టం చేయడంతో… వాడుకోని కరెంటుకు రూ.9 వేల కోట్లు చెల్లించారు. 21 విండ్ మిల్ పీపీఏలు రద్దు చేశారు. విండ్ మిల్స్ కరెంటుకు కూడా చెల్లించాల్సిందేనని కోర్టు చెప్పింది.

మొత్తమ్మీద విద్యుత్ రంగంలో తమ అసమర్థ విధానాలతో ప్రజల నడ్డి విరిచారు. ట్రూఅప్ చార్జీల పేరుతో అదనపు భారం మోపారు. గృహ వినియోగదారులపై 45 శాతం చార్జీలు పెంచారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల 1.53 కోట్ల మంది ప్రజలు ఇబ్బందిపడ్డారు. 50 యూనిట్లు వాడిన పేదల చార్జీలు 100 శాతం పెంచారు. ఇవన్నీ మామూలు సమస్యలు కాదు. రాష్ట్ర విద్యుత్ రంగంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది. ఇప్పుడవన్నీ పరిష్కరించాలంటే చేయాల్సింది చాలా ఉంది. చాలా పెద్ద కసరత్తు చేయాల్సి ఉంది.

నేను నాలుగోసారి ముఖ్యమంత్రిని అయ్యాను. కానీ, ఇంత భారీ స్థాయిలో విద్యుత్ రంగ వ్యవస్థలు దెబ్బతిన్న సందర్భం ఎప్పుడూ చూడలేదు. 2014లో 22.5 మిలియన్ల యూనిట్ల కరెంటు కొరత ఉంటే దాన్ని 3 నెలల్లో అధిగమించాను. అక్కడ్నించి సంస్కరణలు తీసుకువచ్చి, మిగులు విద్యుత్ సాధించాం. 1994-95లో దేశమంతా విద్యుత్ రంగం సంక్షోభంలో ఉంది. ఆ తర్వాత మేం విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చాం. 2004 నాటికి మిగులు విద్యుత్ సాధించాం.

ఈరోజు పరిస్థితి ఏంటంటే… అప్పులు కట్టాలి, దెబ్బతిన్న వ్యవస్థను గాడిలో పెట్టాలి, ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు భారం లేకుండా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఒకపక్కన చూస్తే మోయలేనంత భారం… మరోపక్కన చూస్తే మాపై ప్రజల్లో ఎక్కడ లేనంత అభిమానం! ఈ రెండింటిని బ్యాలన్స్ చేసుకుంటూ, ప్రజలందరి నుంచి సూచనలు అందుకుని ముందుకు వెళతాం. భవిష్యత్ లో విద్యుత్ ఆధారిత వాహనాలు పెరుగుతాయి… ఆ మేరకు విద్యుత్ ఉత్పాదన కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది” అని చంద్రబాబు వివరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :