ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అసెంబ్లీలో మద్యం పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మద్యం అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నామని సభాముఖంగా ప్రకటించారు. లోతైన విచారణ తర్వాత, అవసరమైతే ఈ అంశాన్ని ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్)కి సిఫారసు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు.
గత ప్రభుత్వ హయాంలో తీవ్ర స్థాయిలో మద్యం అక్రమాలు చోటుచేసుకున్నాయని, ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మద్యం విక్రయాల్లో అక్రమ సంపాదన వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. ఇవన్నీ బయటికి లాగేందుకు సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నామని వివరించారు. తప్పు చేసిన వాళ్లను కఠినంగా శిక్షిస్తేనే మళ్లీ తప్పు జరగకుండా ఉంటుందని అన్నారు.