contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జగన్ కి ఓటమి భయం పట్టుకుంది : చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో తాడేపల్లి ప్యాలెస్ లో ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఓడిపోతామని తెలిసి జగన్ హడావుడిగా చర్యలు మొదలుపెట్టాడని, 11 మంది ఇన్చార్జిలను ఇతర నియోజకవర్గాలకు మార్చేశాడని అన్నారు. ఒక చోట చెల్లని కాసు మరో చోట ఎలా చెల్లుతుందని చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు.

బీసీల జపం చేస్తున్న జగన్ కు నిజంగా వారిపై అంత ప్రేమే ఉంటే పులివెందుల టికెట్ బీసీలకు ఇవ్వొచ్చు కదా? అని ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే ప్రజలు తమ వ్యతిరేకతను బయటపెడుతున్నారని తెలిపారు. ఫిబ్రవరి-మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది… ఆ తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఒక్కొక్కరు అడ్రస్ లేకుండా పోతారు… డిపాజిట్లు కూడా గల్లంతవుతాయి అని అన్నారు.

“భరిస్తున్నారు కదా అని ప్రజలను ఈ విధంగా వేధించడం దుర్మార్గం, నీచం. ప్రజలు నీకు (జగన్) ఒక బాధ్యత అప్పగించారు. నువ్వు ప్రభుత్వానికి ఒక ధర్మకర్తలా వ్యవహరించాలి. ఎప్పుడైనా ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు మేలు జరగాలి. నేను అధికారంలో ఉన్నప్పుడు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం. దాని వల్ల అందరూ బాగుపడ్డారు.

ఈ రోజు ఇతను (జగన్) వచ్చిన తర్వాత చేసిన పాపాలన్నీ అందరికీ శాపాలుగా మారాయి. ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక పార్టీ లేదు… అందరూ నాశనమైపోయే పరిస్థితి వచ్చింది. అందుకే రేపు జరిగే ఎన్నికలు ఒక చారిత్రాత్మక ఎన్నికలుగా నిలిచిపోతాయి. సైకో జగన్ వర్సెస్ 5 కోట్ల మంది ప్రజలు… జరగనున్నది ఇదే.

అందరూ గమనించాలి… ఇది నా ఎలక్షన్ కాదు, లేకపోతే టీడీపీ ఎన్నికలు కాదు, టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి ఇది మా ఇద్దరి ఎన్నికలు అంతకన్నా కాదు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఈ ఎన్నికలు జరగబోతున్నాయి.

ఏవో విన్యాసాలు చేసి, నాటకాలు ఆడి… ఇన్చార్జిలను మార్చేస్తే గెలుస్తామనుకుంటున్నారేమో… అది జరగని పని. ఒక నియోజకవర్గంలో పాపాలు చేసిన వారిని మరో నియోజకవర్గానికి మార్చేస్తే గట్టెక్కుతామనుకుంటే అంతకంటే తప్పిదం మరొకటి ఉండదు. ప్రజలు అంతా గమనించాలని నేను కోరుతున్నా. ఇప్పటికే మీరు (ప్రజలు) గమనిస్తున్నారు. సరైన సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు తెలుసు. నేను కూడా మీ అందరి సహకారం కోరుతున్నా.

ఎన్నివేల మందిపై కేసులు పెట్టారో, ఎన్ని వేల మంది జైలుకు వెళ్లారో మీరు చూశారు. ఇప్పటికీ కేసులు పెడుతూనే ఉన్నారు. ఏమీ తెలియని అమాయకులైన కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. బీటెక్ రవి అంశం అందరికీ తెలిసిందే. లోకేశ్ వచ్చాడన్న సమాచారంతో ఆయన కోసం వెళ్లడమే బీటెక్ రవి చేసిన నేరమా? ఆ రోజున తనపై దాడి జరిగిందని ఓ ఎస్సై ఆరోపణ చేస్తే… ఆయనకు ట్రీట్ మెంట్ చేసినట్టు సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ నిజానికి ఆరోజున విధుల్లోనే లేడు. దెబ్బ తగలకపోయినా సదరు ఎస్సై దెబ్బతగలిందని చెబుతాడు… విధుల్లో లేని డాక్టర్ సర్టిఫికెట్ ఇస్తాడు… అందుకని బీటెక్ రవి జైలుకు పోవాలి… ఎంత అరాచకం అండీ ఇది!

అందుకే చెబుతున్నా… ఈసారి ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు, అభ్యర్థులు కాదు… రాష్ట్రం గెలవాలి, తెలుగుజాతి గెలవాలి. అందుకే వినూత్నంగా నేను మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా. అందరి అభిప్రాయాలు తీసుకుని… ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలో నిర్ణయించే బాధ్యత నేను తీసుకుంటాను. అందుకోసం వివిధ రకాల టెక్నాలజీలను కూడా వినియోగించుకుంటాను.

అభ్యర్థుల ఎంపికలో నేను ఎలాంటి తప్పు చేయను… నాకు సహకరించండి చాలు. అధికార పక్షం అభ్యర్థులకు తాడేపల్లి ఆమోదం కావాలి… మా పార్టీ అభ్యర్థులకు ప్రజామోదం ఉంటే చాలు. నేను అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తానన్నది ఒక నూతన విధానం. ఇది ఎలా అన్నది నేను ఎవరికీ చెప్పను. అభ్యర్థులకు సంబంధించిన సమాచారం నా వద్ద తప్ప మరెవరి వద్దా ఉండదు. అలాంటి సమాచారం బయటపెడితే లేనిపోని అపోహలు వస్తాయి. ఆ సమాచారం మేరకు ఏ అభ్యర్థిని ఎక్కడ బరిలో దింపాలో నిర్ణయం తీసుకుంటాను. అందుకోసం అందరినీ ఒప్పిస్తాను.

అందుకే మళ్లీ చెబుతున్నాను… మా పార్టీకే కాదు ఇతర పార్టీలకు కూడా చెబుతున్నా… ఈ ఎన్నికలు చారిత్రాత్మకంగా నిలిచిపోతాయి. పార్టీలు, రాజకీయ కార్యకర్తలే కాదు… ప్రజలు కూడా త్యాగం చేయాలి… రాష్ట్రాన్ని కాపాడుకోవాలి” అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :