దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఈ మధ్యాహ్నం ఆయన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశమయ్యారు. అంతకుముందు, ప్రధాని నరేంద్ర మోదీతోనూ, కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు.
ప్రధాని మోదీతో సుమారు అరగంట పాటు చర్చలు జరిపారు. ఏపీకి ఆర్థికసాయం, ఇతర అంశాలపై ప్రధానికి వివరించారు. మరో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను కూడా చంద్రబాబు కలిశారు.
కాగా, ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును టీడీపీ ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును చంద్రబాబు అభినందించారు. ఇటీవల పార్లమెంటులో ప్రమాణస్వీకారానికి అప్పలనాయుడు సైకిల్ పై వెళ్లడం తెలిసిందే. అప్పలనాయుడు పార్లమెంటుకు సైకిల్ పై వచ్చిన విషయాన్ని చంద్రబాబుకు ఇతర ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు.
నితిన్ గడ్కరీతో సమావేశం ముగించుకుని బయటికి వచ్చిన చంద్రబాబుకు వారు ఈ విషయం చెప్పడంతో… ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును పిలిపించిన చంద్రబాబు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. సమయానికి తగినట్టుగా వ్యవహరించారంటూ చంద్రబాబు కొనియాడారు.