ఆదోని: ఏపీలో అభివృద్ధి పూర్తిగా ఆగి అవినీతి పెరిగిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రం బాగుపడాలంటే తెదేపా పాలన అవసరమని ఆయన పునరుద్ఘాటించారు.కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఆదోనిలో నిర్వహించిన రోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడారు.”రాష్ట్రంలో అన్నింటిపైనా ఛార్జీల మోత మోగిస్తున్నారు. ఆఖరికి చెత్త పైనా పన్ను వేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూకబ్జాలే. ఎక్కడా ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. నాసిరకం మద్యం విక్రయిస్తూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈడీ దాడులు చేస్తారనే భయంతోనే జగన్ వైన్ షాప్‌ల్లో ఆన్‌లైన్ ద్వారా డబ్బులు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో ఇసుక, మద్యం దందాలు పెరిగిపోయాయి. నాసీరకం పత్తి విత్తనాలతో రైతులు నిండా మునిగారు. ఒకే రాజధాని కావాలని ఆదోని ప్రజలు చెబుతున్న విషయం తాడేపల్లిలో ఉన్న జగన్.. పేటీఎమ్ బ్యాచ్ చూడాలి. జగన్‌కు దమ్ముంటే ఆదోని వచ్చి 3 రాజధానుల గురించి అడగాలి. 150 అన్న క్యాంటీన్లను తీసేసి.. ప్రజల కడుపు కొట్టారు
రాష్ట్రంలో పేదలకు ఉపయోగపడే అన్న క్యాంటీన్లు తీసేశారు. మొత్తం 150 అన్న క్యాంటీన్లను తీసేసి.. ప్రజల కడుపు కొట్టారు. తమిళనాడులో అమ్మా క్యాంటిన్ కంటిన్యూ చేస్తానని అక్కడి సీఎం స్టాలిన్ తెలిపారు. తెదేపా అధికారంలోకి రాగానే ప్రతి మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్‌లు ఏర్పాటు చేస్తాను. అభివృద్ధిలో ఏపీ చివరి స్థానంలో ఉంది. డబ్బులు సంపాదించే మార్గం నాకు తెలుసు. ఆస్తులు తాకట్టు పెట్టే మార్గం జగన్‌కు తెలుసు. నాపై కేసు పెట్టేందుకు రాజశేఖర్ రెడ్డి కూడా సాహసించలేదు. ఆదోని ఎమ్మెల్యే కేసులు పెట్టి ఏం చేస్తారు. నన్నే భయపెట్టాలని చూస్తున్నారు. ప్రజలకు తప్ప నేనెవరికీ భయపడను.