టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తిరుపతి జిల్లా నాయుడుపేటలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, నాయుడుపేటలో నేడు జనసునామీ కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని చెప్పడానికి ఈ సభకు వచ్చిన జనమే నిదర్శనమని అన్నారు.
శిశుపాలుడు 100 తప్పులు చేసేవరకు శ్రీకృష్ణుడు క్షమించాడని, కానీ జగన్ వెయ్యి తప్పులు చేశాడని, మీరు క్షమిస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. ప్రజలు ఎంతో నమ్మి ఓటేస్తే, అందరినీ నమ్మించి మోసం చేశాడని చంద్రబాబు మండిపడ్డారు.
నాయుడుపేట ఎస్సీ నియోజకవర్గం అని, తాను రోడ్డు మార్గం ద్వారా వస్తుంటే, ప్రజలంతా జెండాలు చేతబూని చంద్రన్నా మీ వెంటే ఉంటాం అని నినదించారని వెల్లడించారు. అందుకే నేను హామీ ఇస్తున్నా… పేదవారి పక్షానే ఉంటా, పేదవాడితోనే ఉంటా… పేదరిక నిర్మూలన జరిగే వరకు రాత్రింబవళ్లు పనిచేస్తానని పేర్కొన్నారు.
నువ్వేం చేశావు అని నన్ను అంటున్నాడు
ఇప్పుడీ జగన్ ఏం చేస్తున్నాడో తెలుసా… ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడికి ఎమ్మెల్యే సీటు, దోపిడీ చేసేవాడికి ఎంపీ సీటు, లూటీ చేసేవాడికి గుర్తింపునిచ్చే పరిస్థితికి వచ్చాడు. ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ అన్నాడు… ఇచ్చాడా? మెగా డీఎస్సీ అన్నాడు… ఏమైంది?
నిన్న అంటున్నాడు… నువ్వేం చేశావు అని నన్ను అంటున్నాడు. సైకో జగన్ మోహన్ రెడ్డీ… నీకు తెలియదు. నువ్వు బచ్చాగాడిలా గోలీలాడుకుంటున్నప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను… మీ నాన్న కంటే ముందు నేను ముఖ్యమంత్రిని అయ్యాను. ఓసారి చరిత్ర చూసుకో.
సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ వల్లే. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే 8 పర్యాయాలు డీఎస్సీ పెట్టాం. ఎన్టీఆర్ గారు మూడు సార్లు డీఎస్సీ పెట్టారు. మొత్తమ్మీద టీడీపీ హయాంలో 11 సార్లు డీఎస్సీ జరిపాం.
నేనడుగుతున్నా… నువ్వు ఐదేళ్లున్నావు… దిక్కుమాలినోడివి… ఎన్నిసార్లు డీఎస్సీ పెట్టావు? ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చావా? ఐదేళ్లు పరిపాలించిన వ్యక్తివి… నేను ఇది చేశాను అని చెప్పాలా, లేదా?
జగన్ చేశాడు… ఏం చేశాడంటే… ఐదు వేల జీతంతో వాలంటీరు ఉద్యోగాలు ఇచ్చాడు! నేను వాలంటీర్లను కోరుతున్నా… మీలో ఎంఏ పాసైన వాళ్లు కూడా ఉన్నారు, బీటెక్ చదివిన వాళ్లు ఉన్నారు… జగన్ ట్రాప్ లో పడొద్దు.
మీరు నిర్మొహమాటంగా ఉండండి. తటస్థంగా ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి. వాలంటీర్లను నేను తొలగించనని హామీ ఇస్తున్నా. బాగా చదువుకున్న వాలంటీర్లకు వాళ్ల గ్రామాల్లోనే ఉంటూ రూ.50 వేల వరకు సంపాదించుకునే మార్గం నేను చూపిస్తా. ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా… మెగా డీఎస్సీ నిర్వహిస్తా. అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం.
ప్రజలు గొర్రెలు అనుకుంటున్నాడు… లేకపోతే కోళ్లు అనుకుంటున్నాడు
గత ఎన్నికల సమయంలో ముద్దులు పెట్టాడు, బుగ్గలు సవరించాడు. ప్రజలను అమాయకులు అనుకున్నాడు, గొర్రెలు అనుకున్నాడు. లేకపోతే కోళ్లు అనుకున్నాడు… బాగా తిండిపెట్టి కోసుకుని తినొచ్చు అనుకున్నాడు. ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యానికి పనికిరాని వ్యక్తి. అబద్దాలు చెప్పడంలో దిట్ట, ఒక అహంకారి, విధ్వంసం చేసే వ్యక్తి.
ఒక కుటుంబ పెద్ద తిరుగుబోతు, తాగుబోతు అయితే ఆ కుటుంబం బాగుపడుతుందా? అదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విధ్వంసకారుడు, అవినీతిపరుడు అయితే ప్రజలకు న్యాయం జరుగుతుందా? అదే ఈ రాష్ట్రంలో జరిగింది. అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి, అన్ని కులాలు దెబ్బతిన్నాయి. ఆడా మగా, పేద ధనిక అనే తేడా లేకుండా అన్ని మతాల వారు దెబ్బతిన్నారు.
వీరిద్దరినీ గెలిపించమని అడగడానికి ఇక్కడికి వచ్చాను
ఈసారి సూళ్లూరుపేట నుంచి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ పోటీ చేస్తున్నారు. అదే సమయంలో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా వరప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరినీ గెలిపించమని అడగడానికి నేను ఇక్కడికి వచ్చాను.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది. కేంద్రం కూడా సహకరిస్తే తప్ప, ఈ దుర్మార్గుడు చేసిన నష్టాలను మనం పూడ్చుకోలేం. నేను అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నాను. ఐవీఆర్ఎస్ ద్వారా అడిగాను, సర్వేలు చేశాను… పోటీలో ఉన్న వాళ్లందరినీ పరిశీలించిన తర్వాత… పార్టీకి సేవ చేసినవారు, మీకందరికీ ఆమోదయోగ్యంగా ఉండేవారు అయిన విజయశ్రీని అభ్యర్థిగా ఎంపిక చేశాను. మీ అందరినీ అడిగి ఎంపిక చేశాను కాబట్టి, విజయశ్రీని గెలిపించే బాధ్యత మీది.
నెల్లూరులో ఎయిర్ పోర్టు వస్తోంది
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం చూస్తే… తిరుపతి ఒకవైపు, నెల్లూరు మరో వైపు, చెన్నై ఇంకోవైపు.. ఇలా మూడు నగరాలు చేరువలో ఉన్నాయి. రెండు ఎయిర్ పోర్టులు దగ్గర్లోనే ఉన్నాయి… నెల్లూరులో మరో ఎయిర్ పోర్టు కట్టుకుంటే, ఈ ప్రాంతానికి మూడు ఎయిర్ పోర్టులు అందుబాటులో ఉన్నట్టవుతుంది. అదే విధంగా, రెండు పోర్టులు ఉన్నాయి.
మనకు ఇక్కడ శ్రీసిటీ కూడా ఉంది. తిరుపతి ప్రాంతాన్ని ఎలక్ట్రానిక్ హబ్ గా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాను. మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలని ప్రపంచంలో అన్ని కంపెనీలను తీసుకువచ్చాను. హీరో మోటార్స్, టీసీఎల్, జోహో, సెల్కాన్, కార్బన్, డిక్సన్… ఇలా కంపెనీలు తీసుకువచ్చాను. ఇప్పుడీ పరిస్థితి ఉందా? అందుకే జాబు రావాలంటే బాబు రావాలి.
ప్రతి ఒక్కరూ జగన్ చెవిలో పువ్వు పెట్టాలి
నన్ను చూస్తే ఒక కియా మోటార్స్, ఒక హీరో మోటార్స్ వంటి సంస్థలు వస్తాయి. జగన్ ను చూస్తే బూమ్ బూమ్ బ్రాండ్ వస్తుంది. అమరరాజా పరిగెత్తుతుంది, జాకీ పరిశ్రమ పారిపోతుంది. జగన్ ఉద్దేశంలో మన యువత తెలివి లేనిది. నిరుద్యోగంలో నెంబర్ వన్ అయ్యాం. జగన్ మోహన్ రెడ్డీ… అబద్ధాలు చెప్పి మా ప్రజల చెవుల్లో పూలు పెట్టాలనుకుంటున్నావా? ప్రతి ఒక్కరూ ఒక పువ్వు తీసి జగన్ చెవిలో పెట్టి… అతడికి శాశ్వతంగా రాజకీయాలకు విరామం ఇవ్వాలి… అని చంద్రబాబు పిలుపునిచ్చారు.