ఏపీ సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్వేతపత్రంలోని అంశాలను ఆయన సభకు వివరించారు. నాడు విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణా అందిన ఆదాయం 46 శాతం అని వెల్లడించారు. అదే సమయంలో 58 శాతం జనాభా ఉంది. అక్కడ్నించే సమస్యలు ప్రారంభం అయ్యాయని, ఆస్తులు హైదరాబాదులో ఉండిపోయాయని వివరించారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని అంశాలు ఇప్పటికీ పరిష్కారం చేసుకోలేకపోయామని చంద్రబాబు చెప్పారు.
“రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు చాలా తక్కువగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాలు తక్కువగా ఉండడం వల్ల ఆదాయం తక్కువ. సేవల రంగం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. సేవల రంగం తెలంగాణకు వెళితే, ఏపీకి వ్యవసాయం వచ్చింది. ఏ ప్రభుత్వానికైనా వ్యవసాయ రంగంలో ఆదాయం తక్కువగా ఉంటుంది.
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయం రూ.95 వేలుగా ఉంది. విభజన తర్వాత ఏపీ తలసరి ఆదాయం రూ.93,903. అదే సమయంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104కి పెరిగింది.
2014లో వ్యవసాయం ఏపీలో 33 శాతం, తెలంగాణలో 19 శాతం ఉండేది. 2014లో పరిశ్రమలు ఏపీలో 23 శాతం ఉంటే, తెలంగాణలో 19 శాతం ఉన్నాయి. 2014లో సేవల రంగం ఏపీలో 44 శాతం ఉంటే, తెలంగాణలో 61 శాతానికి విస్తరించింది. ఒక్క హైదరాబాద్ వల్లనే సేవల రంగంలో రెండు రాష్ట్రాల మధ్య 17 శాతం తేడా నెలకొంది.
ఇక, రాష్ట్రానికి పోలవరం జీవనాడి వంటిది. పోలవరం పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు నీరందుతుంది. ఏపీకి సుదీర్ఘ తీరప్రాంతం ఉండడం కలిసొచ్చే అంశం. అభివృద్ధి చేస్తే ఏపీ కూడా తెలంగాణతో సమానంగా ముందుకెళుతుంది. రూ.1167 కోట్లు ఖర్చు చేసి పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేశాం. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేయడం వల్ల రూ.44 వేల కోట్ల ఆదాయం చేకూరింది.
విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప ఎయిర్ పోర్టులు అభివృద్ధి చేశాం. కాకినాడ సెజ్ కు 8 వేల ఎకరాల భూమి సేకరిస్తే, గత ప్రభుత్వ హయాంలో అంతా మార్చేశారు. రాష్ట్రంలో 8 లక్షల మందికి పైగా నైపుణ్య శిక్షణ ఇచ్చాం.
కానీ, 2019 తర్వాత తప్పుడు పాలనతో పరిస్థితి తారుమారైంది. అస్తవ్యస్త విద్యుత్ కొనుగోళ్ల విధానం ద్వారా రూ.12,250 కోట్ల మేర అదనపు భారం పడింది. అక్రమ ఇసుక తవ్వకాలతో రూ.7 వేల కోట్ల నష్టం వాటిల్లింది. రూ.9,750 కోట్ల మేర ఖనిజ సంపదను దోచుకున్నారు. 101.16 ఎకరాల మడ అడవులను ధ్వంసం చేస్తే, ఎన్జీటీ రూ.5 కోట్ల జరిమానా వేసింది.
పెట్టుబడిదారుల విశ్వాసం కోల్పోగా… అమరావతి, పోలవరం, శక్తి ఉత్పాదన రంగంలో కాంట్రాక్టులు రద్దయ్యాయి. ప్రభుత్వ అసమర్థత కారణంగా ఒక్క విద్యుత్ రంగంలోనే 1.29 లక్షల కోట్ల నష్టం వచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆయకట్టు నిర్ధారణలో జాప్యం కారణంగా రూ.45 వేల కోట్లు, డ్యామేజీలు, మరమ్మతులతో మరో రూ.4,900 కోట్లు, జల విద్యుత్ ఉత్పాదనలో జాప్యం కారణంగా రూ.3 వేల కోట్లు నష్టం వాటిల్లింది.
గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు వ్యతిరేక విధానం అవలంబించారు. మేం కేటాయించిన 227 ఎకరాల భూములను ఉపసంహరించుకుని, పరిశ్రమలను తరిమేశారు. మా హయాంలో 5 లక్షల కోట్లతో పరిశ్రమలు పనులు ప్రారంభించాయి. 20 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్ లు ఇచ్చాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమానికి బడ్జెట్ లో 34 శాతం ఖర్చు చేశాం. కానీ వీళ్లు అధికారంలోకి వచ్చాక పన్నులు విపరీతంగా పెంచేశారు. విద్యుత్ చార్జీలు పెరిగాయి, ఆర్టీసీ చార్జీలు పెంచారు, ఇసుక రేట్లు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు, చివరికి చెత్త మీద కూడా పన్ను విధించారు.
ఇవాళ్టికి రాష్ట్ర అప్పు రూ.9.74 లక్షల కోట్లు. ఇంకా కొన్ని లెక్కలు రావాల్సి ఉంది. తవ్వేకొద్దీ శవాలు బయటపడుతున్నట్టు అప్పులు బయటికొస్తున్నాయి. తలసరి అప్పు రూ.74,790 నుంచి రూ.1,44,336 పెరిగింది. మరోవైపు ఆదాయం 13.2 శాతం నుంచి 9.5 శాతానికి పడిపోయింది. తలసరి ఆదాయం తగ్గింది, తలసరి అప్పు పెరిగింది.
మరి డీబీటీ అన్నారు కదా… ఎక్కడికి కొట్టుకుపోయింది? ఎందుకు అప్పు చేయాల్సి వచ్చింది? పేదవాడికి ఉపయోగపడాల్సిన కార్యక్రమాలు చేయలేదన్న విషయం ఈ గణాంకాల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతోంది” అంటూ చంద్రబాబు వివరించారు. కాగా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత సీఎం చంద్రబాబు ఢిల్లీ (Delhi) కి పయనం కానున్నారు.