మధ్యప్రదేశ్ సర్కారు బార్ ల పై కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో తమ రాష్ట్రంలో బార్లను మూసేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కొత్త మద్య విధానాన్ని తీసుకొచ్చింది. ఆదివారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. తమ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గుతుందని చెప్పారు.
కొత్త ఎక్సైజ్ పాలసీతో.. రాష్ట్రంలో అన్ని బార్ షాపులు, అక్కడ ఉండే ‘సిట్టింగ్ ప్లేస్ లు’ మూతపడతాయని మంత్రి వివరించారు. లిక్కర్ షాపుల్లోనూ మద్యం అమ్మకాలు మాత్రమే జరుగుతాయని, అక్కడే కూర్చుని తాగేందుకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. విద్యా సంస్థలు, అమ్మాయిల హాస్టళ్లు, ప్రార్థనా స్థలాలకు 100 మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలకు అనుమతి లేదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 2010 నుంచి కొత్తగా ఒక్క మద్యం దుకాణాన్ని కూడా తెరవలేదని నరోత్తమ్ మిశ్రా చెప్పారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ మేరకు కొత్త పాలసీలో మార్పులు చేశామని వెల్లడించారు.