రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని 1 నుండి 3వ తరగతి వరకు ప్లే వే పద్దతిలో బోధించడానికి, ఆ తరగతుల నిర్వహణ అంగన్వాడీ కేంద్రాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి ప్రకటించడం వలన ప్రాథమిక విద్య మొత్తంగా నిర్వీర్యమయ్యే పరిస్థితులు నెలకొంటాయని, అట్టి నిర్ణయాన్ని విరమించుకోవాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. శంతన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రాథమిక పాఠశాలల్లోని 1నుండి 3 వ తరగతులను అంగన్వాడీలకు ఇవ్వడం ద్వారా ప్రాథమిక విద్య పూర్తిగా ప్రయివేటు పరమయ్యే అవకాశాలు ఉంటాయని,కావున అంగన్వాడీలనే ప్రాథమిక పాఠశాలల్లో కలుపుతూ అన్ని ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలన్నారు. అదేవిధంగా ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయ పోస్టులు( ఎల్ఎఫ్ఎల్) మంజూరు చేసి డీఈడీ,బీఈడీ అర్హతలు గల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు అందరికీ ప్రమోషన్ కు అవకాశం కల్పించాలని, ఇటీవల జరిగిన పదోన్నతుల్లో మిగిలిపోయిన పోస్టులకు వెంటనే ప్రమోషన్ కౌన్సిలింగ్ చేపట్టాలని,ఇటీవల బదిలీ అయిన ఎస్.జి.టి.లు అందరిని సబ్సిట్యూట్ లింకు పెట్టకుండా విడుదల చేయాలని,నూతన ఉపాధ్యాయులు వచ్చే వరకు విద్యా వలంటీర్లను నియమించాలని, గతంలో మాదిరిగా ప్రతినెల ప్రమోషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
పి.ఆర్.సి. గడువు ముగిసి సంవత్సరం దాటినందున వెంటనే పి.ఆర్.సి రిపోర్టు కమిషన్ నుండి తెప్పించుకొని, 01.07.2023 నుండి వెంటనే అమలుకు ఉత్తర్వులు విడుదల చేయాలని, పెండింగ్ లో ఉన్న నాలుగు డి.ఎ. లు విడుదల చేయాలని ,ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా ప్రతి పాఠశాలకు స్వచ్ఛ కార్మికులను వెంటనే నియమించాలని, పాఠశాలల కరెంటు బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలని, పాఠశాలలు ప్రారంభమై ఐదు వారాలు దాటినప్పటికీ విద్యార్థులందరికీ సరిపడ పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో అందజేయబడలేదని, వెంటనే అందజేయాలని, పాఠశాలలలో అకాడమిక్ పర్యవేక్షణ కొరకు పర్యవేక్షణ అధికారుల పోస్టులు సృష్టించి మండలానికి ఒకటి భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.