నాగర్ కర్నూల్ : పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం, కొత్తపేట రెవెన్యూ శివారు పరిధిలో తరతరాల నుంచి తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని గ్రామానికి చెందిన దళిత రైతులు కలెక్టరును కోరారు. ఈ మేరకు ప్రాజావాణిలో కలెక్టరుకు వినతి పత్రం అందజేశారు. సాతాపూర్ గ్రామానికి చెందిన దాదాపు 90 మంది ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ రైతలు కొత్తపేట రెవెన్యూ శివారు పరిధిలోని (సర్వే నెం.176, 177) వ్యవసాయ భూముల్లో 1935 సంవత్సరం నుంచి భూమిని సాగుచేసుకుంటున్నట్లు తెలిపారు. 1945 సంవత్సరం నుంచి తాము సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. సాగు చేసుకుంటున్న భూముల్లో రెవెన్యూ అధికారులు మోఖాపైకి వచ్చి ఫిజికల్ సర్వే, పంచనామా కూడా చేశారని కలెక్టరుకు తెలిపారు. 1935 నుంచి తాము తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు హద్దులు పదిలంగా ఉన్నాయని తెలిపారు. కానీ తాము ఎన్నో పర్యాయాలు అధికారుల చుట్టూ తిరిగనా ఇప్పటివరకు కూడా తమ భూములకు పట్టాలు చేయకుండ కాలాయాపన చేస్తున్నారని తెలిపారు. కాబట్టి కలెక్టరు స్పందించి వంశ పారంపర్యంగా సాగు చేసుకుంటున్న తమ భూములకు పట్టాలు ఇప్పించాలని గ్రామ రైతులు కలెక్టరును అభ్యర్థించారు.