సిలిగుడి: కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతుండగా..స్టేజీ పైనే అసౌకర్యానికి గురవడంతో వైద్యులు హుటాహుటిన ఆయనకు చికిత్స అందించారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు గడ్కరీ గురువారం సిలిగుడిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతుంగా.. స్టేజీపైనే అస్వస్థతకు గురయ్యారు. దీంతో గడ్కరీని అక్కడే ఉన్న గ్రీన్ రూంకు తీసుకెళ్లారు. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి హుటాహుటిన వైద్యుడిని రప్పించారు. గ్రీన్ రూంలో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత భాజపా ఎంపీ రాజు బిస్తా.. గడ్కరీని తన కారులో ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎంపీ నివాసంలోనే గడ్కరీకి చికిత్స అందించారు.చక్కెర స్థాయి ఒక్కసారిగా తగ్గడంతో కేంద్రమంత్రి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. గడ్కరీ అనారోగ్యం గురించి తెలుసుకుని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళన చెందారు. పోలీసు కమిషనర్‌కు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు.