- ప్రజారోగ్యానికి ఎన్డీయే ప్రభుత్వం పెద్దపీట
- వైసీపీ హయాంలో రిమ్స్ ని పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు
- రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం
- సౌకర్యాల కొరత, వైద్యుల పనితీరు ఆగ్రహం.
- లోపాలు సరిదిద్దుకుని రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి.
- మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.
ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు రిమ్స్ లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా,మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వైయస్ ఆర్ ఆరోగ్యశ్రీ బోర్డు చూసి మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలు, డాక్టర్ల పనితీరును మంత్రి రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…..కొంతమంది సిబ్బందిలో అలసత్వం కనిపిస్తోంది. విధుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదు, లోపాలు సరిదిద్దుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. వైసీపీ హయాంలో రిమ్స్ ని పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. జిల్లాలోని అన్ని ప్రాంతాలతో పాటు కర్నూలు జిల్లా నుంచి కూడా ప్రజలు రిమ్స్ కి వస్తున్నారంటే ఆస్పత్రిపై వారికున్న నమ్మకం. ఆస్పత్రిలో రోగులకు సరిపడా రక్త నిల్వలు లేవు. పట్టణంలోని ప్రవేట్ బ్లడ్ బ్యాంకుల నుంచి సేకరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆస్పత్రి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి. మళ్లీ విజిట్ కి వస్తా….లోపాలు సరిదిద్దుకుని మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి అన్నారు.
వైసీపీ పాలనలో నాసికరం మద్యంతో 20 నుంచి 40 ఏళ్ల వయస్సున్న యువకులు వేలాది మంది లివర్ దెబ్బతిని చనిపోయారు. మేం రూ. 99 కే నాణ్యమైన మద్యం అందిస్తున్నాం, మా ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోంది. వైసీపీ హయాంలో పాఠశాలలు, కాలేజీలు సైతం గంజాయి, డ్రగ్స్ కి అడ్డాగా మారాయి. డ్రగ్స్, గంజాయి మాఫియాపై రౌడీషీట్లు ఓపెన్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. నగరాల్లోని నడివీధుల్లో వాళ్ల ఫోటోలు ప్లెక్సీలు వేయిస్తాం, రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించేందుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వీరాంజనేయస్వామి అన్నారు.
మంత్రితో పాటు ఆస్పత్రి పరిశీలించిన వారిలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఏపీ టూరిజం కార్పోరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, కలెక్టర్ తమీమ్ అన్సారియా, పలువురు జిల్లా అధికారులున్నారు.