contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఇసుక అక్రమాలపై క్రిమినల్‌ చర్యలు : కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ హెచ్చరిక

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు : ప్రజలకు ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ హెచ్చరించారు. ప్రభుత్వ ఉచిత ఇసుక విధానంపై జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్‌తో కలిసి కలెక్టర్‌ కలెక్టరేట్‌లో విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలోని ఎటపాక మండలం గండాల ప్రాంతంలో రెండు రీచ్‌ల్లో 1 లక్ష 65 వేల 557 టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగానే ఇస్తుందని, టన్ను ఇసుక లోడింగ్‌ రూ.300 మాత్రమే చెల్లించాలన్నారు. రవాణా ఖర్చులు లబ్ధిదారులే భరించాలన్నారు. ఉచిత ఇసుక పంపిణీలో అదనపు ధరలు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఇసుకను పొందేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సచివాలయంలోనే బుకింగ్‌ చేసుకుని, డిజిటల్‌ విధానంలో సొమ్ము చెల్లించవచ్చునన్నారు. ఎవరికీ ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రశీదు మేరకు మాత్రమే నగదు చెల్లించాలన్నారు. అలాగే ఇసుక రవాణాకు వినియోగించే వాహనాలను విధిగా జిల్లా రవాణా అధికారి కార్యాలయంలో రిజిస్టర్‌ చేయించుకుని అనుమతి పొందాలన్నారు. అలాగే ఉచిత ఇసుక సరఫరా నేపథ్యంలో ఎటువంటి అక్రమాలు, ఇబ్బందులు ఏర్పడినా ప్రజలు నేరుగా టోల్‌ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో నంబర్‌ 18005994599, జిల్లా స్థాయిలో నంబర్‌ 18004256061కు ఫోన్‌ చేయాలని కలెక్టర్‌ సూచించారు. అలాగే ఉచిత ఇసుక వ్యవహారాలను పర్యవేక్షించేందుకు జాయింట్‌ కలెక్టర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించినట్టు చెప్పారు. అందిన ఫిర్యాదులను 24 గంటల్లో పరిష్కరిస్తామన్నారు. ఇసుక రవాణా వాహనాలు జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి కార్యాలయంలో నమోదు చేసుకుని విధిగా యూనిక్‌ ఐడి నంబరు పొందాలన్నారు. అలాగే ఉచిత ఇసుక సరఫరాపై కొత్త విధానం వచ్చేనెల 11వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. అప్పటి వరకు ప్రస్తుత విధానం కొనసాగుతుందన్నారు. జిల్లా ఎస్పీ అమిత్‌బర్దార్‌ మాట్లాడుతూ.. ఇసుక పాయింట్ల వద్ద పోలీసు చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. చలానా లేకుండా ఇసుక రీచ్‌లకు వెళ్లకూడదని, ఉచిత ఇసుక సరఫరాలో అక్రమాలకు పాల్పడితే అందుకు బాధ్యులపై చర్యలు చేపడతామన్నారు. స్థానిక అవసరాల మేరకు నాణ్యమైన ఇసుకను సరఫరా చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. ఉచిత ఇసుక, రవాణా ఛార్జీలపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని ఎస్‌పీ అమిత్‌ బర్దార్‌ అన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :