చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్వగ్రామం పులివర్తి వారి పల్లెలో స్నేహితులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, గ్రామస్తులు అందరూ కలిసి ఆత్మీయ సన్మాన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని సాదరంగా ఆహ్వానం పలికారు.
అందరి ఆహ్వానం మేరకు పాకాల మండలం, పులివర్తి వారి పల్లె గ్రామ వాస్తవ్యులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అఖండ మెజారిటీతో గెలిచిన తర్వాత మొదటిసారిగా తన స్వగ్రామానికి కుటుంబ సమేతంగా చేరుకున్నారు. గ్రామానికి చేరుకున్న పులివర్తి కుటుంబ సభ్యులకు కేరళ వాయిద్యాలతో, మేళ తాళాలతో యువత టపాకాయలు కాలుస్తూ, మహిళలు మంగళహారతులతో, గ్రామస్తులు పూలు జల్లి స్వాగతం పలికారు. పులివర్తి కుటుంబ సభ్యులు గ్రామంలోని వినాయక స్వామికి ముందుగా పూజలు నిర్వహించి తరువాత సత్తెమ్మ తల్లికి కొబ్బరికాయల మొక్కు చెల్లించి, రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఒక్కొక్కరిని పేరుపేరునా చిన్ననాటి స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు ఆప్యాయంగా పలకరిస్తూ గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభకు చేరుకున్నారు. సన్నిహితులు ఒక్కొక్కరుగా పులివర్తి నాని గురించి నాటి స్మృతులను గురించి ప్రసంగించారు.
పులివర్తి సుధా రెడ్డి మాట్లాడుతూ మొదట నన్ను అందరూ తిట్టుకున్నప్పటికీ నేను చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని గ్రహించి ఎంతోమంది నా వెనుక ఉండీ ప్రోత్సహించి మా ఈ విజయానికి కారకులైనారు. ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి నేను సభాముఖంగా శిరసు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నా భర్త పై జరిగిన ఘోర సంఘటనను దాడిగా చిత్రీకరిస్తున్నారు కానీ అది 100% హత్య యత్నం… హత్యాయత్నం కేసులో ముద్దాయిలను పులివర్తి నాని క్షమించిన నేను క్షమించబోనని న్యాయపరంగా వారికి శిక్ష పడే వరకు పోరాటం చేస్తూనే ఉంటానని ఆమె తెలిపారు.
ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ నేను చిన్నతనంలో చదివింది ఇక్కడే అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇక్కడ నా చిన్ననాటి స్నేహితులు, నా సన్నిహితులు, మా చిన్నతనంలో తెలిసి తెలియక ఏమైనా తప్పు చేసి మా అమ్మ మందలిస్తే మా పెదనాన్న ఎందుకు వాడిని అరుస్తున్నావు అంటూ నన్ను ఎప్పుడు వెనక వెనకేసుకొచ్చేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే నా చిన్ననాటి స్మృతులు ఎన్నో ఉన్నాయి అంటూ చిన్ననాటి స్మృతులను గురించి సభలో అందరితో పంచుకున్నారు. నేను మీ వాడిని మీ కుటుంబ సభ్యులలో ఒకడిని ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నారు. నేను మన గ్రామం నుంచి అభివృద్ధి ప్రారంభిస్తాను పార్టీలకు అతీతంగా అందరు సహకరించాలని కోరారు. చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. గతంలో ఏదైనా కారణం చేత పొరపాటు జరిగి ఉంటే నేను సరిదిద్దుకుంటానన్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. గ్రామస్తులు ఏర్పాటుచేసిన విందులో పాల్గొన్నారు.