తిరుపతి / చంద్రగిరి : పాకాల మండల పరిధిలోని ఏకోపాధ్యాయ పాఠశాలల పనితీరు ఉనికికే ప్రమాదంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు మండలంలో 25 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో చదువుకునే విద్యార్థులు ఉన్నప్పటికీ అనేక కారణాలతో తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారు. ఈ నేపద్యంలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పది లోపు ఉండటం మూలంగా వచ్చే విద్యా సంవత్సరానికి ఈ పాఠశాలలో ఉనికి ప్రమాదకరంగా మారిందని వారు వాపోతున్నారు. ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక శ్రద్ధతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారికి ప్రభుత్వ పాఠశాలలో జరిగే మేలును, విద్యాబోధన విషయాలను వివరించి ప్రభుత్వ పాఠశాలలకు తెప్పించుకోవడంలో విఫలమవుతున్నారని విమర్శలు లేకపోలేదు. మండలానికి ఇద్దరు ఎంఈఓ లు ఉన్నప్పటికీ… ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆశించిన విధంగా పెరగడం లేదని మండల వాసులు వాపోతున్నారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల వైపు మళ్లించుకునే విషయాల్లో ఇకనైనా అధికారులు చొరవ తీసుకుని, విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలల బలోపేతం కు ఇకనైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.