పాలకొల్లు: విద్వేషాలు రెచ్చగొట్టేందుకే రాజీనామాల పేరిట మంత్రులు, ఎమ్మెల్యేలు నాటకాలాడుతున్నారని అమరావతి రైతులు మండిపడ్డారు.పశ్చిమగోదావరి జిల్లాలో 27వ రోజు మహా పాదయాత్రను కొనసాగించిన రైతులు.. వాతావరణం సహకరించకున్నా మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు. వివిధ సంఘాల నేతలు యాత్రకు ఎదురేగి స్వాగతం పలికారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలంటూ నినదించారు. పూటకోమాట మార్చిన నేతలను ఎవరూ నమ్మరని.. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సాయంత్రం వరకు సాగిన పాదయాత్ర పాలకొల్లులో ముగిసింది. అమరావతి రైతులు ఇవాళ 14 కిలోమీటర్లు నడిచారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, వివిధ సంఘాల నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు.
