ఆంధ్రప్రదేశ్ : పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజుపై ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉన్న పలాసలో హత్యా సంస్కృతి తీసుకువచ్చిన ఘనత అప్పలరాజుకే చెందుతుందని విమర్శించారు. టీడీపీ నాయకుడు బడ్డా నాగరాజు హత్యకు కుట్ర పన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కుట్ర చేసిన నిందితులంతా అప్పలరాజు అనుచరులేని స్పష్టం చేశారు.
నిందితులు అప్పలరాజుతో కలిసి ఉన్న ఫొటోలను ఈ సందర్భంగా గౌతు శిరీష మీడియాకు విడుదల చేశారు. ఆ నిందితులు మీతో కలిసి భోంచేస్తున్నట్టు ఈ ఫొటోల్లో ఉన్నాయి… మీ భార్యను కూడా నిందితులు కలిసినట్టు ఈ ఫొటోల్లో ఉంది… దీనికి మీరేం సమాధానం చెబుతారంటూ అప్పలరాజును నిలదీశారు.
టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే పోలీస్ స్టేషన్ లో వేస్తామని హెచ్చరించారు. హుందా రాజకీయాలు చేయడం అలవర్చుకోవాలని హితవు పలికారు. చాలామంది నేతలు పలాసను రాజకీయాలకు అతీతంగా పాలించారని, కానీ నీలాంటి చిల్లర రాజకీయాలు ఎవరూ చేయలేదంటూ సీదిరి అప్పలరాజుపై మండిపడ్డారు.