ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలతో అట్టుడికిన జిల్లా పల్నాడు. ఎల్లుండి (జూన్ 4) కౌంటింగ్ నేపథ్యంలో, పల్నాడు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే కొత్త ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన మలికా గార్గ్ అల్లర్లకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
ఇప్పటికే పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతుండగా… కౌంటింగ్ నేపథ్యంలో, నేటి సాయంత్రం నుంచి 5వ తేదీ వరకు జిల్లాలో బంద్ వాతావరణం కనిపించనుంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, లాడ్జిలు, కల్యాణ మండపాలను మూసివేయాలని పోలీసులు నిర్ణయించారు.
కౌంటింగ్ రోజున ఎలాంటి ఘర్షణలు, ఉద్రిక్తతలు తలెత్తకుండా చూడాలని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో, పల్నాడు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే జిల్లాలో ఎక్కడ చూసినా పోలీస్ సైరన్లు వినిపిస్తున్నాయి. పోలీసులు గ్రామగ్రామాల్లో తిరుగుతూ మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చిన్నపాటి ఘర్షణలకు పాల్పడినా రౌడీ షీట్ తెరుస్తామని స్పష్టం చేస్తున్నారు.
జిల్లాలో 3 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. కౌంటింగ్ రోజున నరసరావుపేటను అష్టదిగ్బంధనం చేయనున్నారు. నరసరావుపేటలో ప్రస్తుతం ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారులు, నలుగురు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.