పల్నాడు జిల్లా / బొల్లాపల్లి మండలం / జయంతి రామ పురం : జయంతి రామాపురం, మేళ్ళవాగు, రెడ్డిపాలెం గ్రామాలలో కుక్కలు, కోతులు, బెడద రోజురోజుకు ఎక్కువైంది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఒంటరిగా వీధుల్లోకి రావాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో అయితే ఇంటి నుంచి కాలు బయట పెట్టే పరిస్థితి లేదు. కుక్కలు, కోతులు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇటీవల కుక్కల దాడిలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. ప్రజలు రోజువారి విధులు ముగించుకొని ఇళ్లకు చేరుకునే సమయంలో చేతుల్లో ఉన్న తినుబండారాలు, ఇతర సామగ్రిని కుక్కలు, కోతులు లాక్కుంటున్నాయి. ఏమాత్రం ప్రతిఘటించిన విచక్షణరహితంగా దాడి చేసి గాయపర్చుతున్నాయి.
కుక్కులు, కోతులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి, పంట పలాలను కూడా పాడుచేస్తున్నాయి. జయంతి రామాపురంలో మిరియాల వెంకాయమ్మ నే మహిళను కోతులు కరువగా చెయ్యి విరిగింది, చావా చిన్నమ్మాయికు కాలు విరిగింది, ఉప్పు ఎంకాయమ్మ కు నడుము విరిగి మంచాన పడింది. ఇలా చెప్పుకుంటూ పొతే అనేక సమస్యలు గ్రామస్తులు ఎదుర్కొంటున్నారు.
ఎక్కడెక్కడినుంచో కోతులను, కుక్కలను జయంతి రామాపురం, మేళ్ళవాగు, రెడ్డిపాలెం అటవీ ప్రాంతంలో వదిలి వెళుతున్నారు. అవి గ్రామాలలో ఏ వీదిలో చూసిన కుక్కలు, కోతులు గుంపులుగా కనిపిస్తున్నాయి. మహిళలు, చిన్నారులు ఒంటరిగా బయటకు రాలేని పరిస్థితి ఉంది. సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.