పల్నాడు జిల్లా ,అమరావతి: అమరావతి ధరణికోట జైల్ సింగ్ కాలనీ సమీపంలో ఉన్న పంట పొలాల్లోని వరద నీరు కాలనీలోకి రానీయకుండా భవిష్యత్తులో ప్రొటక్షన్ వాల్ నిర్మిస్తామని పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కాలనీవాసులకు హామీ ఇచ్చారు. అమరావతి మండలం ధరణికోటలోని జైల్ సింగ్ కాలనీలో వరదల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న 350 కుటుంబాలకు 1500 రూపాయల విలువచేసే నిత్యవసర సరుకుల కిట్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. అమరావతి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు దండా నాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నిత్యవసర సరుకుల కిట్లను ఇచ్చేందుకు టిడిపి నాయకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఎంతోమంది ప్రజలు వరదల్లో చిక్కుకుని కనీసం తినడానికి నిత్యవసర సరుకులు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు సహాయం అందించేందుకు పుర్తిస్తాయిలో కృషి చేస్తుందన్నారు ప్రభుత్వంతో పాటు పార్టీ నాయకులు కూడా వరద బాధితులకు సహాయాన్ని అందించేందుకు పెద్ద ఎత్తున ముందుకు రావాలని పిలుపునిచ్చారు.