పల్నాడు జిల్లా/ క్రోసూరు/ : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా పని చేస్తున్నామన్నారు. 3వ రోజు “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా క్రోసూరు మండలం 88తాళ్లూరు, అందుకూరు గ్రామాల్లో ఆదివారం జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న 88 తాళ్ళూరు – పీసపాడు రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 100 రోజులుగా చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి పని చేస్తామన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో తెలిపిన విధంగా పింఛన్ రూ.4 వేలకు పెంపు, మెగా డీఎస్సీ, గ్రామీణాభివృద్ధికి పంచాయతీకి నిధులు, అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు రూ.5 కే భోజనం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారన్నారు. గత వైసీపీ పాలనలో వ్యవస్థలను సర్వనాశనం చేశారన్నారు. జగన్ తన ముఠాతో కలిసి ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. జగన్ లాంటి నాయకులను రాజకీయాలను దూరంగా ఉంచాలన్నారు. అభివృద్ధి,సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వంద రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకుందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.