పల్నాడు జిల్లా, పెద్దకూరపాడు: రైతులకు న్యాయం చేసేలా వ్యవసాయ శాఖ సిబ్బంది పని చేయాలని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. రైతుకు అన్యాయం జరిగేలా ఎవరూ వ్యవహరించవద్దని ఆయన సూచించారు. నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఐదు మండలాల వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బందితో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ అన్యాయం జరిగిందని రైతులెవరూ బాధపడకూడదన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేస్తూ ప్రభుత్వ పథకాలను అర్హులైన రైతులకు అందించాలని సూచించారు. నిష్పక్షపాతంగా పని చేస్తూ రైతులకు సేవలు అందించాలని కోరారు. రైతుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు పని చేస్తున్నారన్నారు. వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. రానున్న రోజుల్లో రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. ఎరువులు,విత్తనాలను కొరత లేకుండా సమర్థవంతంగా రైతులకు అందించాలన్నారు. ఈ కెవైసి, మట్టినమూనాల సేకరణ,పంట సాగుదారుని హక్కు పత్రాల నమోదు ప్రక్రియలను నిర్ధిష్ట సమయంలోపు పూర్తి చేయాలన్నారు.