ప్లాస్టిక్ రహిత జిల్లాగా పల్నాడు ను తీర్చిదిద్దేందుకు ఫ్లెక్సీ బ్యానర్స్ ప్రింటింగ్ వ్యాపారులు సహకరించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి సూచించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్పందన సమావేశ మందిరంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్స్ నిర్వహణ యాజమాన్యాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్లాస్టిక్ వస్తువుల వాడకం పై నిషేధం విధించడం జరిగిందన్నారు. మానవ మనుగడకు ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ ను నిర్మూలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం భవిష్యత్ తరాలకు ఉపయోగకరంగా మారడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందన్నారు. నవంబర్ 1వ తేదీ నుండి జిల్లాలో ప్లాస్టిక్ బ్యానర్ల ప్రింటింగ్ కార్యకలాపాలను నిలుపుదల చేసి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా క్లాత్ బ్యానర్ల ముద్రణకు చర్యలు తీసుకోవాలని వ్యాపారులకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్లాస్టిక్ బ్యానర్ లను తయారుచేసిన, వినియోగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సమాజంలో వస్తున్న మార్పులు కనుగుణంగా వ్యాపారులు తమ జీవన విధాన గమనాన్ని ప్రత్యామ్నాయ మార్గాలను కోవాలని సూచించారు. ఈ క్రమంలో ఇబ్బందులు పడే వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తమ వంతు తోడ్పాటును అందిస్తామన్నారు. అంతకుముందు జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లు ముద్రణ చేపడుతున్న వ్యాపారుల వివరాలు, ఆదాయం, ప్రత్యామ్నాయ మార్గాలు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్లాస్టిక్ బ్యానర్ల ముద్రణ కారణంగా ఉపాధిని కోల్పోతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి, తగిన ప్రణాళికలను రూపొందించి మేలు చేసే కార్యక్రమాలను చేపడతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధానం ప్లాస్టిక్ పై నిషేధం విధించినందున జిల్లా అధికారులు వ్యాపారులపై నిఘా పెట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పాల్పడే వారిపై తొలి దశలో అపరాధ రుసుము 100 రూపాయలు వసూలు చేయడం, వారి షాపులను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. పదేపదే ఈ తరహా వ్యాపార కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు, వారి వ్యాపారాలను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. స్నేహపూర్వక సమాజంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న వారిలో ప్రతి ఒక్కరం ఉన్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు చేసిన ప్రతిపాదన లను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ వినాయకం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇంజనీర్ ఎం నారాయణ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జోసఫ్ కుమార్, నరసరావుపేట రెవెన్యూ డివిజన్ అధికారి శేషిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
