- పంజాబ్ కు చెందిన ఓ జంట హైకోర్టులో పిటిషన్
- తాము సహజీవనం చేస్తున్నామని వెల్లడి… రక్షణ కల్పించాలని వినతి
- పురుషుడికి వివాహం కాగా, మహిళ అవివాహిత
- విడాకులు తీసుకోకుండా మరో మహిళతో కలిసి ఉండడం నేరమన్న హైకోర్టు
- పిటిషన్ ను డిస్మిస్ చేసిన ఏకసభ్య ధర్మాసనం
తాము సహజీవనం చేస్తున్నామని, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోర్టుకెక్కిన ఓ జంటకు పంజాబ్-హర్యానా హైకోర్టు నుంచి దిమ్మదిరిగే స్పందన ఎదురైంది.
పంజాబ్ కు చెందిన ఓ పురుషుడు, మహిళ కొంతకాలంగా కలిసి ఉంటున్నారు. అతడికి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్య నుంచి విడిగా ఉంటున్నాడు. అతడితో కలిసున్న మహిళకు ఇంకా పెళ్లి కాలేదు.
అయితే, కలిసి జీవిస్తున్న వారిద్దరూ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. మహిళ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే, జస్టిస్ కుల్దీప్ తివారీ ఏకసభ్య ధర్మాసనం నుంచి ఊహించని వ్యాఖ్యలు ఎదురయ్యాయి.
“ఈ కేసులో పురుషుడు ఇంకా భార్య నుంచి విడాకులు తీసుకోలేదు. విడాకులు తీసుకోకుండా మరో మహిళతో కలిసి ఉంటే దాన్ని సహజీవనం అనరు. మరో మహిళతో కామంతో కూడిన వ్యభిచారం చేస్తున్నాడు అంటారు. సెక్షన్ 494/495 కింది ఇది నేరం. దీనికి శిక్ష కూడా ఉంటుంది. వ్యభిచారం కేసులో శిక్ష నుంచి తప్పించుకోవడానికి సహజీవనం అంటూ ఈ పిటిషన్ వేసినట్టుంది” అంటూ జస్టిస్ కుల్దీప్ తివారీ మొట్టికాయలు వేశారు.
అంతేకాదు, ఇలాంటి వ్యవహారాల్లో తాము రక్షణ కల్పించలేమని చెబుతూ వారి పిటిషన్ ను తోసిపుచ్చారు.