- తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు, జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో జరిగే గంగమ్మ జాతరలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.
- తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరను పురస్కరించుకుని శ్రీ వేశాలమ్మ గంగమ్మ తల్లికి సారె ను సమర్పించిన జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి
- జాతర పై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు.
- ఆలయ ప్రాంగణములోనే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు.
- ఆలయం ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, బాడీ వార్న్ కెమెరాలతో నిరంతర నిఘా పర్యవేక్షణ..
- జాతర ముసుగులో మద్యం సేవించి, తోటి భక్తులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు.
- అక్రమ వసూళ్లకు పాల్పడితే అరెస్ట్, కేసు నమోదు.
- రికార్డింగ్ డాన్స్ లు, డీజే మ్యూజిక్ సిస్టం, ఆర్కెస్ట్రా వంటి అసాంఘిక ప్రదర్శనలకు అనుమతి లేదు : జిల్లా యస్పి పి. పరమేశ్వర రెడ్డి.
తిరుపతి: తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ .పి. పరమేశ్వర రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పి. పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ, శ్రీ వేశాలమ్మ తల్లి అమ్మవారు గ్రామ దేవతగా వెలిసి, ప్రజలను కాపాడుతూ ఉన్న అమ్మవారికి సారెను పోలీస్ శాఖ తరఫున ఈరోజు నేను సమర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రీ తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారి జాతరను, రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు ఈ ఏడాది పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి దేవస్థాన అధికారులు సన్నాహాలు చేస్తున్నారనీ చెప్పారు.
ఈ నేపథ్యంలో జాతర సందర్భంగా అమ్మవారి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువ సంఖ్యలో ఉంటుందన్న అధికారుల అంచనాలకు, అనుగుణంగా భారీ స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ చర్యలు:-
జాతర సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా వుండటంతో చైన్ స్నాచింగ్, జేబు దొంగతనాలు వంటివి పాల్పడే వ్యక్తులు ఇది ఒక అవకాశంగా తీసుకుని, భక్తుల విలువైన సొమ్ములను దోచుకునేందుకు అవకాశంగా భావిస్తారు కావున ఆలయ పరిసర ప్రాంతాల్లోనే కాక బస్టాండ్, రైల్వే స్టేషన్ ఇతరత్రా రద్దీ ప్రాంతాలలో రోడ్ల వెంట పోలీసు పహారా, పికెట్స్ ఏర్పాటు, ప్రత్యేక క్రైమ్ బృందాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
చిన్నపిల్లల భద్రత దృష్ట్యా..
జాతర సందర్భంగా పిల్లలతో ఆలయానికి వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, పసిపిల్లలు తప్పి పోవడం, ఇతరత్రా నేరాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
తోపులాటకు ఒక్క అవకాశం లేదు
ఆలయ పరిసరాల్లో మరియు ఆలయం లోపల దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులు తోపులాటకు అవకాశం లేకుండా అడుగడుగునా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి తొక్కిసలాటలు, ఇతర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
వేషధారణలో వసూళ్లు తగవు.
సమాజంలో ఉన్న చెడును అంతం అందించుటకు అమ్మవారు రోజుకు ఒక వేషంతో సంచరించినట్లు స్థల పురాణం చెబుతున్నదన్నారు.
జాతర సందర్భంగా అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు రకరకాల వేషధారణలలో భక్తులు ఆలయానికి వస్తారు. అయితే కొందరు వేషధారణ ముసుగులో మహిళలను బెదిరించి కాసులు వసూలు చేసుకోవడం తగదని, అటువంటి వారిపై పోలీసులు నిఘా ఉంచుతారని, వారిపై చర్యలు తీసుకోబడును అని హెచ్చరించారు.
ట్రాఫిక్ నియంత్రణ దిశగా..
అమ్మవారి ఆలయానికి పరిసరప్రాంతాలలో ఆలయానికి చేరుకునే మార్గాలు అన్నింటిని బ్యారికేడ్ లతో అడ్డుకట్ట వేయ పడుతుందని, వాహనాలను అనుమతించబడవని తెలిపారు. ఆలయ పరిసర ప్రాంతాలలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వాహనాలను ఆలయం నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలోనే అన్ని వైపులా ఆపివేయడం జరుగుతుందని, నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాలలోనే వాహనాలను పార్కింగ్ చేసి మీకు మీ తోటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి ట్రాఫిక్ పోలీసుల ద్వారా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అసభ్య ప్రవర్తన వీడండి
జాతర ముసుగులో ఆకతాయిలు మహిళల, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసుల దృష్టికి వస్తే… వారిని ఉపేక్షించేది లేదని, వారిపై వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలతో కూడిన కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా యువకులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
సాంస్కృతిక వేదిక వద్ద భద్రత కట్టుదిట్టం
ఈ ఏడాది జాతరలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 6 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తుడా మైదానంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక వేదిక వద్దకు అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు, స్థానికులు జాతర సంబరాలలో భారీగా పాల్గొనే అవకాశం ఉన్నందున పోలీసు పహారా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అనుమానితులకు సంబంధించి
జాతర గుంపులో ఎవరైనా అనుమానితులు ఉన్నట్లు ప్రజలు గుర్తిస్తే వెంటనే డయల్ 100 కు గాని, సమీపంలోని పోలీసు వారికి గాని తెలియజేయాలని సూచించారు.
మత్తులో దౌర్జన్యాలకు దిగి అప్రతిష్ట పాలు కాకండి…
యువకులు, పురుషులు జాతర సందర్భంగా మద్యం సేవించి ఈ ఆలయానికి వచ్చే తోటి భక్తులపై దురుసుగా ప్రవర్తించడం, దౌర్జన్యాలకు దిగడం, దుర్భాషలాడడం వంటివి చేసినట్లు, మహిళల పట్ల, ఇతరుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిస్తే చర్యలు తప్పవన్నారు.
జిల్లా ఎస్పీ పోలీసులకు సూచన
ఏడు రోజులపాటు అట్టహాసంగా జరగబోయే జాతర సందర్భంగా విధులు నిర్వహించే పోలీసులు అప్రమత్తంగా ఉంటూ, అసాంఘిక కార్యక్రమాలకు, దొంగతనాలకు, అరాచకాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల గంగ జాతర జరుగుతున్న నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడుటకు, ట్రాఫిక్ నియంత్రణకు స్పెషల్ పార్టీస్, బీడీ టీమ్స్, ఏఆర్ పోలీస్ వారి సేవలను పూర్తిగా వినియోగించుకుని భక్తులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామన్నారు.
తిరుపతి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న గంగ జాతర ఉత్సవాల్లో మహిళలతో ఎలాంటి రికార్డింగ్ డ్యాన్సులు, ఆర్కెస్ట్రా ప్రదర్శనలకు అనుమతి లేదు. ఈ నిబంధనలను అతిక్రమించిన జాతరలు/ఉత్సవాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల SHO లను ఆదేశించారు. మహిళలను అశ్లీల నృత్యాలు, ప్రదర్శనలు చేసేందుకు తమ ప్రాంగణాన్ని అనుమతించిన నిర్వాహకులందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఆఖరి రోజున “చంప నరుకుడు” కార్యక్రమం రాత్రి-పగలు ఉంటుంది. కాబట్టి ఆ రోజున సుమారు 1000 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో జాతరలు, ఉత్సవాలు నిర్వహణపై గట్టి నిఘా ఉంచి, అవసరమైన భద్రతా చర్యలను తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. విధి నిర్వహణలో అధికారులు, సిబ్బంది ఏదైనా అవకతవకలకు పాల్పడినచో, దానికి సదరు అధికారులు, సిబ్బంది బాధ్యత వహించాలని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు వారు ఇతర శాఖల అధికారులను & సిబ్బందిని సమన్వయపరచుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ, సమిష్టిగా వారికి కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా, నిక్కచ్చిగా, నిర్వర్తిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం వారు రాష్ట్ర పండుగగా ప్రకటించి, మొదటిసారి నిర్వహిస్తున్న నేపథ్యంలో జాతరను విజయవంతం చేయవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ క్రైమ్ విమల కుమారి, డి.యస్.పి లు యస్.బి గిరిధర, వెస్ట్ యశ్వంత్, ఈస్ట్ సురేంద్ర రెడ్డి, ట్రాఫిక్ నరసప్ప, సి.ఐ లు యస్.బి శ్రీనివాసులు, యస్.బి రామకృష్ణ అచారి, వెస్ట్ శివప్రసాద్, ట్రాఫిక్ భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, యస్.ఐ లు, ఆలయ కమిటీ సభ్యులు సునీల్ చక్రవర్తి, నరసింహా, EO రామచంద్ర రెడ్డి, అసోసియేషన్ సభ్యులు, పోలీస్ సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.