పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకున్న పరిణామాలపై గిరిజన సంఘాలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైద్యం పేరుతో పురుష ఉపాధ్యాయులు బాలికలను ప్రైవేట్ ఆసుపత్రులు మరియు ఆర్‌ఎంపీ డాక్టర్ల వద్దకు తీసుకెళ్లారని వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం, గిరిజన అభ్యుదయ సంఘం, ట్రైబల్ రైట్స్ ఫోరం, ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నాయకులు కలిసి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఐటిడిఏ పీవో అసుతోష్ శ్రీవాస్తవ్‌లకు వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు పాలక రంజిత్ కుమార్, పల్ల సరేష్, మువ్వల అమర్నాద్, ఆరిక చంద్ర శేఖర్, ఇంటికిప్పల రామకృష్ణ, చెల్లూరు సీతారాం, కోలక గౌరమ్మ, బీ. రవికుమార్, బీటీ నాయుడు తదితరులు మాట్లాడారు. బాలికల పాఠశాలల్లో పురుష ఉపాధ్యాయుల నియామకమే అనేక సమస్యలకు దారితీస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా ఉపాధ్యాయులు, డెప్యూటీ మెట్రన్ ఉన్నా కూడా బాలికలను వైద్యం పేరుతో పురుష ఉపాధ్యాయులే బయటకు తీసుకెళ్లారంటే, ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని వారు పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యానికి ఏదైనా హాని జరిగినట్లయితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు.
ఇప్పటికే ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తక్షణమే మహిళా అధికారులతో విచారణ జరపాలని, విచారణ సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పురుష ఉపాధ్యాయులు పాఠశాలలో ఉండకూడదని వారు స్పష్టం చేశారు. అప్పుడు మాత్రమే నిజాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.
అంతేగాక, బాలికలను బయటకు తీసుకెళ్లే సమయంలో వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారా లేదా అనే కోణంలో కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ మరియు ఐటిడిఏ పీవో – ముగ్గురు మహిళా అధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని, తప్పులుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.