పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపీఎస్ , ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న 35 మంది నూతన ప్రొబేషనరీ ఎస్సైలను జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ 35 మంది నూతన ప్రొబేషనరీ ఎస్సైలు, అనంతపురం పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసి, ప్రాక్టికల్ శిక్షణ కోసం పార్వతీపురం మన్యం జిల్లాకు కేటాయించబడ్డారు. గుంటూరు మరియు కర్నూల్ రేంజ్‌కు చెందిన వారు,
జిల్లా ఎస్పీ, శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి యువ పోలీసులకు అభినందనలు తెలిపారు. ఆయన వారి విద్య, శిక్షణ, మరియు వారి విధులపై అవగాహన పెంచుకోవడానికీ, వారికి పోలీస్ స్టేషన్లలో క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించేందుకు గైడెన్స్ ఇచ్చారు.
ఈ సందర్భంలో ఎస్పీ మాట్లాడుతూ, విధి నిర్వహణలో నిర్భయంగా, నిష్పక్షపాతంగా, క్రమశిక్షణ, నిజాయతీ, పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తూ ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలని, పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా విధులను నిర్వర్తించాలని సూచించారు.
ముఖ్యంగా, నూతన ఎస్సైలు ప్రాక్టికల్ శిక్షణలో టెక్నాలజీని వినియోగించడం, ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించడం, ఎఫ్.ఐ.ఆర్., ధర్యాప్తు రికార్డులను సక్రమంగా నిర్వహించడం, సి.సి.టి.ఎన్.ఎస్., డ్రోన్స్ మరియు సి.సి.కెమెరాలను ఉపయోగించడం, పెట్రోలింగ్, పహరా బీట్ నిర్వహణ, నేర స్థల పరిశోధన, కేసు డైరీ రాయడం, మరియు ముఖ్యమైన కేసుల దర్యాప్తు వంటి అంశాలపై శిక్షణ పొందవలసిన అవసరం గురించి వివరించారు.
మరో ముఖ్యమైన విషయం, ఎక్కడైనా అనుమానం వచ్చిన వెంటనే సీనియర్ అధికారి నుండి సహాయం తీసుకోవాలని, వారి సూచనలను పాటించాలని ఎస్పీ తెలిపారు.