- ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రను కోరిన విద్య మరియు విద్యా సహాయకులు
- ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర
పార్వతీపురం : గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న మాకు వివిధ సంక్షేమ వసతి గృహాల్లో ప్రమోషన్లు కల్పించాలని విద్యా మరియు విద్యా సహాయకులు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచందర్ ను కోరారు. బుధవారం ఎమ్మెల్యే స్వగృహానికి వారు చేరుకుని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. మేము విధుల్లో చేరి ఐదున్నరేళ్ళు పూర్తయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి ప్రమోషన్లు కల్పించలేదన్నారు. సచివాలయాల్లో పనిచేస్తున్న వివిధ శాఖల వారికి ఇప్పటికే పదోన్నతులు ఇవ్వడం జరిగిందన్నారు. వివిధ వసతగృహాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, గ్రేటు-2 పోస్టుల్లో మమ్మల్ని ప్రమోట్ చేయాలని కోరారు. గ్రామ సచివాలయం వ్యవస్థలో మిగిలిన ఫంక్షనరీల మాదిరిగానే మండల లెవెల్ అధికారిని (మండల సంక్షేమ అధికారి) మాకు కూడా ఏర్పాటు చేసి మమల్ని కూడా ఈ పదోన్నతికి పరిగణలోకి తీసుకోగలరని కోరారు. మేము, పంచాయతీ కార్యదర్శి , వార్డ్ అడ్మిన్ సెక్రటరీ అందరమూ గ్రాడ్యుయేట్ విద్యార్హతతో కేటగిరి -1 పరీక్ష వ్రాసి ఈ పోస్ట్ కు ఎంపిక అయినప్పటికీ మమ్ములను మా లైన్ డిపార్ట్మెంట్ వారు కుక్, హెల్పర్ /డ్రైవర్ తర్వాత చివరిగా ఉన్న ఇ-క్లాస్ లో చేర్చి మరింత ఆందోళనకు గురి చేశారు .ఈ గ్రేడ్ లో మార్పు కోరుకుంటున్నామని తెలిపారు. గ్రామ సచివాలయం ఉద్యోగుల జీతభత్యాలు తక్కువగా ఉండటం వలన మాపై దయతలచి మా ప్రోబేషన్ రెండు సంవత్సరాలకి రావలసిన నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయగలరని ఎమ్మెల్యేను కోరారు. మేము ఉద్యోగంలో చేరి 6 సంవత్సరాలు పూర్తవుతుంది కావున ప్రమోషన్ రాని వారికి అదనపు ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని కోరారు. ఈ విషయంపై ఎమ్మెల్యే స్పందిస్తూ మీ సమస్యలను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో విద్య మరియు విద్య సహాయకులు ఆనందం వ్యక్తం చేశారు.