పార్వతీపురం మన్యం జిల్లా : వేసవి ఎండలు మండుతున్న నేపథ్యంలో పార్వతీపురం మండలంలోని తాళ్లబురిడికి గ్రామం తాగునీటి కొరతతో అల్లాడిపోతుంది. ప్రజలు తాగునీరు కొనుక్కొని తాగాల్సిన దుస్థితి నెలకొనిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాలపై చిన్న చూపు వహించకూడదని, వాటికీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జిల్లా చైర్మన్ వంగల దాలి నాయుడు, జిల్లా నాయకులు కోలాకిరణ్ కుమార్, మండల అధ్యక్షులు తీళ్ల గౌరీ శంకరరావు, నాయకులు బి. రాంబాబు తదితరులు పార్వతీపురం ఎంపీడీవో గోర్జి రమేష్‌ను కలిసి, మండలంలోని తాగునీటి సమస్యలపై చర్చించారు.
తాళ్లబురిడికి గ్రామంలోని పాత బజారు వీధి, మధ్య వీధి, దిగువ ఎస్సి వీధి, గొల్ల వీధి, శాలి వీధి, కాలనీల్లో తాగునీటి సౌకర్యాలు లేవని, ప్రజలు కట్టుదిట్టుగా నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాక, సంధివలస, ధోని గెడ్డ, ములగవలస, తొక్కుడు వలస కొత్తపాకలు, నోవవలస, కొత్త తాన్నవలస, చొక్కాపుగానివలస, బందలుప్పి, బుచ్చింపేట, మెట్టవలస, డీకే పట్నం, టేకులోవ వంటి గ్రామాల్లోనూ నీటి ఎద్దడి తీవ్రమైందని తెలిపారు.
ఈ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని, వేసవి రోగాల నివారణ కోసం నీటికి క్రమం తప్పకుండా క్లోరినేషన్ చేయాలని నాయకులు ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు.
ఈ ప్రతిస్పందనగా ఎంపీడీవో గోర్జి రమేష్ తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.