పిఠాపురం : పిఠాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలికపై మాధవపురం చెత్త డంపింగ్ వద్ద నిన్న సాయంత్రం అఘాయిత్యం జరిగిందని తెలిసి చాలా బాధ కలిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదల పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ సమయంలో అప్రమత్తమైన స్థానికులు నిందితుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చిందని, లేనిపక్షంలో నిందితుడు తప్పించుకోడానికి ఆస్కారం కలిగేదన్నారు. ఈ అమానుష చర్యను సభ్యసమాజంలోని ప్రతి ఒక్కరు ఖండించాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ దుస్సంఘటన గురించి తెలిసిన వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించానని, ప్రభుత్వపరంగా అన్ని విధాలా బాధితురాలిని, వారి కుటుంబ సభ్యులకు సహాయసహకారాలు అందచేస్తామన్నారు. ముద్దాయికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. స్థానిక జనసేన నాయకులను కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి, సహాయం అందించాలని స్పష్టం చేశామన్నారు.