పల్నాడు జిల్లా , పిడుగురాళ్ల పట్టణం లెనిన్ నగర్ స్తూపం సెంటర్లో శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు వివిధ ప్రజా సంఘాలు ఘనంగా నివాళులు అర్పించాయి. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రజా సమస్యలపైన ప్రశ్నించిన వారిని అర్బన్ నక్సలైట్లుగా చిత్రీకరించి జీవిత ఖైదీలుగా జైల్లో మగ్గించడం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమేనన్నారు. జీవితాంతం ప్రజల పక్షాన నిలిచిన నేరానికి పదేళ్లు జైలు శిక్ష అనుభవించి, అనారోగ్యం పాలైన ప్రొఫెసర్ సాయిబాబా మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటన్నారు. ఆయన మరణానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఉపా చట్టం రద్దుచేసి, జైల్లో మగ్గుతున్న రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పిడిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు వై. వెంకటేశ్వరరావు, కే ఎన్ పి ఎస్ నాయకులు కె.కృష్ణ, భారత్ బచావో నాయకులు నవజ్యోతి, సర్దార్, ఎం సిపిఐ నాయకులు ఓర్సు కృష్ణ, పిడిఎం నాయకులు శ్రీనివాసరావు, మస్తాన్వలి, సిపిఐ నాయకులు కృష్ణా నాయక్, సిపిఎం టీ. శ్రీనివాసరావు,గిరిజన సంఘం కోట నాయక్, ఆర్టిఐ కుమార్ ఎమ్మార్పీఎస్ ఎం.బాబు తదితరులు పాల్గొన్నారు.