అల్లూరి జిల్లా: ముంచంగిపుట్టు,ది రిపోర్టర్ : మణిపూర్ హింసకాండను వ్యతిరేకిస్తూ మండల క్రైస్తవ ఫెలోషిప్ ఆధ్వర్యంలో అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల కేంద్రంలో మంగళవారం భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ శాంతి ర్యాలీకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, గిరిజన సంఘం, సిపిఎం, అఖిలభారత మహిళా సంఘం మద్దతు తెలిపాయి. మండల హోలీ గ్రౌండ్ సమీపంలో ఉన్న రైస్ చర్చ్ నుండి మొదలుకొని తాసిల్దార్ కార్యాలయం,ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు ఆపాలని, ఆదివాసి గిరిజన మహిళలకు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. మణిపూర్ ముఖ్యమంత్రి గో బ్యాక్ గో బ్యాక్.. నరేంద్ర మోడీ డౌన్ డౌన్, మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం, హత్య కు పాల్పడిన దుండగులను బహిరంగంగా ఉరితీయాలని నినాదాలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు హక్కుగా నిర్మించబడిన ఆర్టికల్ 25,26 ప్రకారం గిరిజనులు ఏ మతాన్ని అయినా స్వీకరించవచ్చని, మతోన్మాద ఉన్మాదంతో బిజెపి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో మణిపూర్ మహిళలపై జరుగుతున్న హింసకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వజ్రాయుధమైన ఓటు హక్కుతో మతోన్మాద బిజెపి పార్టీని గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. హింసకాండ కు ప్రోత్సహించే బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా అన్ని రాష్ట్రాల ప్రజలు మేలుకోవాలని, ప్రపంచ వ్యాప్తంగా భారతదేశాన్ని వేలెత్తి చూపినంత దుస్థితికి దిగజారిన బిజెపి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని, లేనిపక్షంలో గిరిజనులకు మనుగడ లేకుండా పోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అఖిలభారత మహిళా సంఘం అధ్యక్షులు ఈశ్వరి, విజయ మాట్లాడుతూ.. మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించి సమూహిక అత్యాచారాలు,మాన భంగాలు,వందలాది మంది మహిళలకు హత్య చేసినప్పటికీ మణిపూర్ రాష్ట్రం, బిజెపి ప్రభుత్వం కనీసం చలనం లేకుండా వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు. మణిపూర్ రాష్ట్ర గిరిజన ప్రాంతంలో మహిళల అత్యాచారాలు, మానభంగలు బిజెపి ప్రభుత్వమే చెలరేగి స్తుందని మణిపూర్ లో జరిగిన హింసకాండలో మహిళలపై విరుచుకుపడ్డ మానవ మృగాలను తక్షణమే ఉరితీయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పాస్టర్స్ ఫెలోషిప్ మండల అధ్యక్షుడు కె. మోహన్, కార్యదర్శి చిట్టిబాబు, రత్నమని, సురేష్, ప్రసాద్, అర్జున్ తోపాటు వివిధ రాజకీయ, ప్రజా సంఘాల నేతలు, పాస్టర్లు,మారుమూల గ్రామాలకు చెందిన క్రైస్తవులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.