ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో అనుబంధం ఉన్న రైతులకు ఇది గుడ్ న్యూస్. 16వ విడతలో రూ.2000 మొత్తాన్ని కేంద్రం ఇవాళ జమ చేయనుంది. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం 16వ విడతను ఫిబ్రవరి 28న రిలీజ్ చేస్తున్నారు. అంటే మరో కొన్ని గంటల్లో రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు పడతాయి.
దేశంలోని రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.6000 మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా.. అంటే ప్రతీసారి రూ. 2000 చొప్పున విడుదల చేస్తారు. నవంబర్ 2023లో పీఎం కిసాన్ 15వ విడతను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పుడు 16వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. నాలుగు నెలలకు ఒకసారి రైతుల ఖాతాలకు ఈ విధంగా జమ చేస్తారు. ఇక గతేడాది ఫిబ్రవరి 27న ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేసిన విషయం తెలిసిందే.